అమెరికన్లకి కూడా సేవలందిస్తున్న మనవాళ్ళు

November 02, 2016
img

అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ తదితర దేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు తమ మాతృదేశానికి, తమ తమ రాష్ట్రాలకి సహాయసహకారాలు అందిస్తుండటం గురించి వింటూనే ఉంటాము. కానీ అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఆ దేశంలో నిరుపేదలకి కూడా సహాయపడుతుండటం విశేషం. 

మన రాష్ట్రానికే చెందిన కొంతమంది కలిసి అపూర్వమైన ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం చాలా హర్షణీయం. బేయర్స్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు అందరూ కలిసి నిరుపేద అమెరికన్లకి ఆహారం అందించేందుకు ఫుడ్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమానికి కిరణ్ నుకిరంటి 2012లో శ్రీకారం చుట్టారు. ఆయనే దానికి కో-ఆర్గనైజర్ గా నిర్వహణ బాధ్యతలని కూడా చూస్తున్నారు. అప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమం అందరి అండదండలతో నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. 

మనం మన చుట్టూ ఉన్న ప్రజలతో, సమాజంతో మమేకం కాగలిగినప్పుడే అదీ మనదే మనమూ అక్కడివారమే అని భావన కలుగుతుంది. ఆ ప్రాంతం..అక్కడ నివసిస్తున్న ప్రజల పట్ల మనం ప్రేమాభిమానాలు, చూపినప్పుడే ఆ ప్రాంతం, ప్రజలు అంతా మనవాళ్ళే మనం కూడా వారిలో భాగమే అనే భావన కలుగుతుంది. అప్పుడే మన చుట్టూ ఉండేవారు మనల్ని వారిలో ఒకరిగా భావించగాలుగుతారని కిరణ్ నుకిరంటి అన్నారు. నిజమే కదా..ఆనాడు స్వామీ వివేకానందుడు చెప్పింది ఇదే..విశ్వప్రేమ. ఈ ప్రపంచంలో అందరూ ఒక పెద్ద కుటుంబానికి చెందినవారని చెప్పారు. అదే స్పూర్తితో కిరణ్ నుకిరంటి అమెరికాలో ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.  

ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, అమెరికాలో నిరుపేదలకి ఆహారం అందించడం. మన పిల్లలకి దీపావళి పండుగ జరుపుకోవడం అంటే కేవలం టాపాసులు కాల్చడమే కాదు..అవసరమైన వారికి సహాయపడటం కూడా అనే విషయాన్నీ తెలియజేయడం. అందుకే ఈ సేవా కార్యక్రమానికి ‘దీపావళి ఫుడ్ డ్రైవ్’ పేరుతో నిర్వహిస్తున్నారు. తద్వారా అమెరికన్లకి కూడా ఆ పండుగ యొక్క ప్రాముఖ్యత అర్ధం చేసుకొంటున్నారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికాలో స్థిరపడిన ప్రవాసభారతీయుల నుంచి నిధులు లేదా నేరుగా బియ్యం, పస్తా, క్యాన్-ఫుడ్స్, అమెరికన్లు తినే ఇతర ఆహార వస్తువులని సమీకరించి వారికి అందజేస్తున్నారు. 

అమెరికాలో ఇటువంటి సేవలు అందిస్తున్న ది చస్టర్ కంట్రీ అండ్ కెన్నెట్, స్క్వేర్ ఫుడ్ బ్యాంక్స్ వంటి ఇతర సంస్థలతో కలిసి ఈ సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్న కమ్యూనిటీలు వాటి నిర్వాహకుల పేర్లు:

బేయర్స్ స్టేషన్ కమ్యూనిటీ-వెంకట్ పతిపాటి

మల్వర్న్ హంట్-రాధ అల్ల

వైట్ ల్యాండ్ వుడ్స్-మంజుల కె,

రిజర్వు ఎట్ ఈగిల్- భాను ప్రకాష్ 

ఈగిల్ హంట్-రితు గోయాల్ గుప్తా

విండ్ సర్ రిట్జ్-శ్రీరాం గుర్తి  

వెయిన్ బ్రూక్-పవన్ తిరునహరి, 

చస్ట్ నట్ రిట్జ్-సహన కుమార్, 

బెల్ టేవరన్-శ్రీనివాస్ నాగోటి

యాపిల్ క్రాస్-సిబసిస్ పాది

ఈ సేవా కార్యక్రమాలని క్రమంగా అమెరికాలో అన్ని నగరాలు, పట్టణాలకి విస్తరించేందుకు ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఈ సేవా కార్యక్రమం మొదలుపెట్టిన మొదటి సం.లోనే సుమారు 850 కేజీల ఆహార వస్తువులు సేకరించి పేదలకి అందించగలిగారు. గత ఏడాది నిర్వహించిన ఈ ఫుడ్ డ్రైవ్ ద్వారా సుమారు 16,000 కేజీల ఆహార పదార్ధాలు సేకరించి నిరుపేదలకి అందించగలిగారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 36,000 కేజీల ఆహార పదార్ధాలు సేకరించి ది చస్టర్ కంట్రీ అండ్ కెన్నెట్, స్క్వేర్ ఫుడ్ బ్యాంక్స్ ద్వారా నిరుపేదలకి అందించగలిగారు. మిగిలిన ఈ రెండు నెలలోగా మరొక 25,000 కేజీలు ఆహార పదార్ధాలు సమీకరించి అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. 

కనుక దీపావళి పండుగ సందర్భంగా మళ్ళీ మరొకసారి ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కిరణ్ నుకిరంటి తెలిపారు. నవంబర్ 5న, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పైన పేర్కొనబడిన కమ్యూనిటీలకి కానీ లేదా ఈ క్రింద పేర్కొనబడిన సెంటర్ లో గానీ అమెరికన్లు తినే ఎటువంటి ఆహార పదార్దాలనైన అందించవచ్చును.

స్టేషన్ బౌలివర్డ్ 1190, బయర్స్ స్టేషన్ డెవెలప్మెంట్ వద్ద సౌత్ 401, ఫెలోషిప్ రోడ్డులో విరాళాలు, ఆహారవస్తువులు సేకరించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలియజేస్తున్నారు. 

ఈ ప్రాంతాలకి దూరంగా నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకోదలిస్తే www.diwalifooddrive.org. అనే వెబ్ సైట్ ద్వారా విరాళాలు అందించవచ్చును. ఆ విరాళాలతో డిస్కౌంట్ ద్వారా లభిస్తున్న ఆహార పదార్ధాలని కొనుగోలు చేసి నిరుపేదలకి అందజేస్తారు.


Related Post