మీరు పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పాలని కోరుకొంటున్నారా?

September 26, 2016
img

గత 3-4 దశాబ్దాలుగా భారత్ పై పాక్ ఉగ్రవాదులు దాడులు చేస్తూ అనేక వందల మందిని పొట్టనపెట్టుకొంటూనే ఉన్నారు. పార్లమెంటుపై, ముంబై రైళ్ళలో, రైల్వే స్టేషన్లలో, హోటల్ తాజ్, దిల్ షుక్ నగర్, లుంబినీ పార్క్, బెంగళూరు, కాశ్మీర్ ఇలాగ ఒకటా రెండా...వరుసగా భారత్ పై పాక్ ప్రేరిత ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో వందలాది మంది భారతీయులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. 

గత ఏడాది పాక్ ఉగ్రమూకలు పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడులకి పాల్పడి భారత్ సార్వభౌమత్వానికి మళ్ళీ సవాలు విసిరారు. కానీ భారత ప్రభుత్వం పాకిస్తాన్ని ఏమీ చేయలేకపోయింది. ఆ ధైర్యంతోనే పాక్ ఉగ్రవాదులు మళ్ళీ యూరీ ఆర్మీ క్యాంప్ పై దాడికి సాహసించ గలిగారని చెప్పక తప్పదు. వారు భారత్ సేనలని నేరుగా ఎదుర్కొనే సాహసం చేయలేరు కనుక దొంగచాటుగా ఆర్మీ క్యాంప్ లోకి చొరబడి అక్కడ సైనిక గుడారాలకి నిప్పు పెట్టి, వాటిలో నిద్రపోతున్న సైనికులని అతి దారుణంగా చంపారు. 

అది చూసి యావత్ భారతీయుల మనసులు బాధతో ఆక్రోశిస్తున్నాయి. పాక్ పై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు. కానీ అణ్వాయుధ దేశాలైన భారత్, పాక్ నేరుగా ప్రత్యక్ష యుద్దానికి దిగితే పాకిస్తాన్ ఓడిపోవచ్చు. సర్వనాశనం కావచ్చు. భారత్-పాక్ మధ్య అణుయుద్ధం జరిగినట్లయితే పాకిస్తాన్ కొత్తగా కోల్పోయేది..నష్టపోయేదీ ఏమీ ఉండదు..ఎందుకంటే అది ఈ ఏడు దశాబ్దాలలో సాధించింది ఏమీ లేదు కనుక. కానీ ఈ ఏడు దశాబ్దాలలో సమిష్టి కృషితో భారత్ సాధించిన అభివృద్ధిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ యుద్ద కవ్వింపులకి లొంగకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ దానిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 

అయితే వాటితో భారత ప్రజల ఆగ్రహం చల్లారదని అందరికీ తెలుసు. అలాగని వారు నేరుగా పాకిస్తాన్ని ఏమీ చేయలేరని కూడా తెలుసు. కానీ పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పేందుకు టెడ్ పో, డానా రోహ్రబచేర్ అనే  ఇద్దరు అమెరికా సెనేటర్లు భారతీయులకి ఒక గొప్ప మార్గం చూపించారు. పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా గుర్తించి దానికి ఆర్ధిక సహాయం అందించడం నిలిపివేయాలని కోరుతూ వారు క్రిందటి బుధవారం అమెరికన్ కాంగ్రెస్ లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. దాని కోసం వారు ఒక పిటిషన్ రూపొందించి ప్రపంచ ప్రజల మద్దతు కోరుతున్నారు. ముఖ్యంగా భారతీయుల మద్దతు ఆశిస్తున్నారు. దానిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామాకి అందించి, ఆయనపై ఒత్తిడి చేయాలని భావిస్తున్నారు. 

అమెరికా చట్టాల ప్రకారం లక్షమందికి పైగా మద్దతు పొందిన ఏ పిటిషన్నయినా సరే అమెరికా అధ్యక్షుడు తప్పనిసరిగా పరిశీలించి దానిపై తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు)ని కోరవలసి ఉంటుంది. ఇప్పటికే ఆ పిటిషన్ పై సుమారు 70,000 మందికి పైగా సంతకాలు చేశారు. ప్రస్తుతం అమెరికాతో సహా వివిధ దేశాలలో స్థిరపడిన భారతీయులు అందరూ దానికి మద్దతు ఇస్తున్నారు. ఇంకా దేశ ప్రజలందరూ కూడా దానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. 

అమెరికా సెనేటర్లు చేస్తున్న ఆ పోరాటానికి మద్దతు ఇవ్వడం ద్వారా  పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకొనేందుకు భారతీయులు అందరికీ ఒక గొప్ప అవకాశం లభిస్తుంది. ఒకవేళ వారి పిటిషన్ పై అమెరికన్ కాంగ్రెస్ సానుకూలంగా స్పందించి, పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి, ఆర్ధిక సహాయం చేయడం నిలిపివేసినట్లయితే, ఆ దేశంతో ఎటువంటి యుద్ధం చేయకుండానే భారత్ విజయం సాధించినట్లు అవుతుంది. భారత్ కి పాక్ ఉగ్రవాదం బెడద కొంతైనా తగ్గే అవకాశాలు ఉంటాయి. 

సాధారణ పౌరులమైన మనం పాక్ చేస్తున్న పనులని చూస్తూ చాలా ఆవేదన చెందుతున్నప్పటికీ ఏమీ చేయలేకపోతున్నమనే బాధ ఉంటుంది. కనుక అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి పిటిషన్ కి మద్దతు తెలిపినట్లయితే, పాక్ ఉగ్రవాదుల పట్ల భారతీయులు ఎంత ఆగ్రహంతో ఉన్నారనే విషయం అమెరికా ప్రభుత్వానికి కూడా తెలియజెప్పినట్లు ఉంటుంది.  కనుక మీరు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలనుకొంటున్నట్లయితే ఈ క్రిందనివ్వబడిన పిటిషన్ పై ఆన్ లైన్ లోనే మద్దతు తెలపవచ్చు.

https://petitions.whitehouse.gov/petition/we-people-ask-administration-declare-pakistan-state-sponsor-terrorism-hr6069

Related Post