అమెరికా దుస్థితికి ట్రంప్ కారణం: కమలా హ్యారిస్‌

August 14, 2020
img

అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్ధిగా కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, “అటువంటి నీచమైన వ్యక్తిత్వం ఉన్న మహిళను ఎంపికచేస్తున్నట్లు విని నేను చాలా ఆశ్చర్యపోయాను,” అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

ఆమె కూడా అంతే ధీటుగా స్పందిస్తూ, “అసలు ఆయన అధ్యక్ష పదవికి తగినవాడుకాడు. ఆయనకు సరైన నాయకత్వ లక్షణాలు లేకపోవడం చేత కరోనాను కట్టడిచేయలేక దేశ ఆర్ధిక వ్యవస్థను సర్వనాశనం చేశాడు. ఆయన నోటిదురుసు, చేతకానితనంతో అమెరికా ప్రతిష్టకు చాలా భంగం కలిగించాడు. అగ్రరాజ్యంగా వెలుగుతున్న అమెరికా నేడు ఈ దుస్థితికి చేరుకోవడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ కారకుడు అని చెప్పక తప్పదు,” అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎదురీదుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌కు భారత్ మరియు ఆఫ్రికా మూలాలున్న కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపిక చేయడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఆమె రాకతో అమెరికాలో ప్రవాసభారతీయులు, నల్లజాతీయులు డెమొక్రాట్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు పెరుగుతాయి. అదేకనుక జరిగితే మళ్ళీ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టాలని కలలుగంటున్న డొనాల్డ్‌ ట్రంప్‌కు ఓటమి తప్పదు. బహుశః అందుకే ఆమెపై అంతగా విరుచుకుపడుతున్నారనుకోవచ్చు. 

అందరికీ తెలిసిన కారణాల చేత ఈసారి అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్‌ ట్రంప్‌ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగినప్పటికీ, అమెరికా...ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు ఆయన ఎంతకైనా తెగిస్తారనే మంచిపేరు కూడా సంపాదించుకొన్నారు. కనుక ఆయనను ఓడించడం అంతా తేలికకాదనే సంగతి డెమొక్రాట్ అభ్యర్ధి జో బిడెన్, ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారిస్‌ ఇద్దరికీ బాగా తెలుసు. కనుక వారు కరోనా కారణంగా అమెరికాకు జరిగిన, జరుగుతున్న నష్టాన్ని ట్రంప్‌ ఖాతాలో వేసి ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ పోరాటంలో చివరికి ఎవరు నెగ్గుతారో తెలియాలంటే నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరిగే వరకు ఎదురుచూడక తప్పదు. 

Related Post