చైనాపై చర్యలు తప్పవు..త్వరలోనే ప్రకటన: అమెరికా

July 09, 2020
img

కరోనాకు ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఎదురేలేదన్నట్లు అన్నీ సాగిపోయేవి కానీ కరోనా దెబ్బకు ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ముఖ్యంగా నవంబర్‌ 3న జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచేందుకు డోనాల్డ్ ట్రంప్‌ ఇప్పుడు ఏటికి ఎదురీదవలసివస్తోంది. కనుక సహజంగానే దీనికంతటికీ కారణమైన చైనాపై ట్రంప్‌ ఆగ్రహంగా ఉన్నారు. చైనాపై కటినచర్యలు తీసుకొంటామని ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా వైట్‌హౌజ్‌ మీడియా కార్యదర్శి కెలే మెకానీ కూడా చైనాపై త్వరలోనే కటినచర్యలు తీసుకోబోతున్నట్లు బుదవారం చెప్పారు. త్వరలోనే దానికి సంబందించి ఓ ప్రకటన చేయబోతునట్లు తెలిపారు. 

చైనాపై అమెరికా ఏ మేరకు చర్యలు తీసుకొంటుందో ఇప్పుడే ఊహించడం తొందరపాటే అవుతుంది కానీ వాటితో ట్రంప్‌ రెండు ప్రయోజనాలు ఆశిస్తున్నారని చెప్పవచ్చు. 1. అమెరికాను ఈ దుస్థితిలో నిలబెట్టిన చైనాపై ప్రతీకారం తీర్చుకోవడం. 2. ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో తన వైఫల్యం ఏమీ లేదని... చైనా కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని అమెరికన్లకు నమ్మించే ప్రయత్నం. 

డోనాల్డ్ ట్రంప్‌ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే ఇది తప్పదు కనుక చైనాపై చర్యలు అనివార్యమేనని చెప్పవచ్చు. అధ్యక్ష ఎన్నికలకు ముందు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన లక్షలాదిమంది ప్రవాసభారతీయుల ఓట్లు చాలా చాలా అవసరం. వాటి కోసం ట్రంప్‌ భారత్‌కు ఎటువంటి సహాయసహకారాలు అందించేందుకైన సిద్దపడతారు. అందుకే భారత్‌-చైనా ఘర్షణలలో భారత్‌కు మద్దతు పలికారనుకోవచ్చు. కనుక ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోగలిగితే భారత్‌ చాలా లబ్దిపొందవచ్చు.

Related Post