ఇవాంకా ట్రంప్‌ సహాయకురాలికి కరోనా

May 09, 2020
img

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు కారెవరూ కరోనాకు అతీతం అనుకోవలసి వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ముద్దుల కుమార్తె ఇవాంకా ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కానీ ఆమె గత రెండు నెలలుగా ఇవాంకాను కలవకుండా ఫోన్‌ ద్వారానే ఆమె పనులన్నీ చక్కబెడుతుండటంతో ఇవాంకాకు కరోనా సోకే ప్రమాదం తప్పింది. కరోనా వైరస్ అమెరికాలో ప్రవేశించినప్పటి నుంచి వైట్ హౌస్ సిబ్బంది అందరికీ తరచూ వైద్య పరీక్షలు జరుపుతున్నారు. ఇవాంకా ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలికి ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేనప్పటికీ ఇటీవల జరిపిన పరీక్షలలో కరోనా సోకినట్లు నిర్ధారణ అవడంతో ఆమెను క్వారెంటైన్‌కు తరలించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఇవాంకా, ఆమె భర్త జేర్డ్ కుష్నర్‌కు కరోనా పరీక్షలు చేయగా వారిరువురికీ కరోనా సోకలేదని నిర్ధారణ అయ్యింది. ఇకపై తాను కూడా ప్రతీరోజు కరోనా పరీక్షలు చేయించుకొంటానని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చెప్పారు. 

 దేశంలో కరోనా కేసులు,మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నప్పటికీ, అమెరికా ఆర్ధికవ్యవస్థను కాపాడుకొనేందుకు ఒక్క న్యూయార్క్‌ తప్ప మిగిలిన రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుండటంతో, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నట్లు తాజా సమాచారం. 

ఇప్పటి వరకు అమెరికాలో 13, 17, 376 మందికి కరోనా సోకగా వారిలో 1,82,902 మంది కోలుకొన్నారు. 78,200 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. 

కరోనా క్యాపిటల్‌గా మారిన న్యూయార్క్‌లో అత్యధికంగా 3,30,407 కేసులు నమోదుకాగా వారిలో 56,378 మంది కోలుకొన్నారు. 21,045 మంది చనిపోయారు.   

తెలుగువారు ఎక్కువగా ఉండే న్యూజెర్సీలో 1,35,454 కేసులు నమోదు కాగా 8,952 మంది చనిపోయారు. 

మసాచూసెట్స్ లో 75,333 కేసులు, 4,702 మరణాలు, ఇల్లీనాయిస్‌లో 73,760 కేసులు 3,241 మరణాలు, కాలిఫోర్నియాలో 62,512 కేసులు, 2,585 మరణాలు, పెన్సల్వేనియాలో 52,915 కేసులు 3,416 మరణాలు నమోదు అయ్యాయి. అమెరికన్ సమోవా రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

Related Post