కెనడాలో దారుణం..దుండగుడి కాల్పులలో 16 మంది మృతి

April 20, 2020
img

యావత్ ప్రపంచదేశాలు కరోనా మహమ్మారితో పోరాడుతుంటే పాక్‌ ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు చెలరేగిపోతూనే ఉన్నారు. కెనడాలోని నోవా స్కోటియా రాష్ట్రంలో హాలిఫిక్స్ నగరానికి 100 కిమీ దూరంలో ఉన్న ఓ మారుమూల పట్టణం పోర్టాపిక్యూలో ఆదివారం ఈ దారుణం జరిగింది. పోలీసు యూనిఫారం ధరించి ఆ ప్రాంతానికి వచ్చిన గెబ్రియల్ వర్ట్ మ్యాన్ (51) అనే ఓ వ్యక్తి తనవద్ద ఉన్న తుపాకీతో స్థానికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ కాల్పులలో 16మంది చనిపోయారు. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని అతనిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులలో హైడి స్టీవెన్‌సన్ అనే 23 ఏళ్ళు వయసున్న మహిళా పోలీసు కానిస్టేబుల్ కూడా మరణించిందని, ఆమెకు ఇద్దరు చిన్న పిల్లలున్నారని స్థానిక పోలీస్ అధికారి డేనియల్ బ్రెయిన్ తెలిపారు. కెనడా చరిత్రలో గత 30 ఏళ్ళలో జరిగిన అత్యంత విషాదకర ఘటన ఇదని ఆయన చెప్పారు. పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఫోటోను మీడియాకు విడుదల చేశారు. 

1989లో ఇదేవిధంగా ఓ దుండగుడు జరిపిన కాల్పులలో 14మంది చనిపోయారు. ఆనాటి నుంచి కెనడాలో తుపాకుల విక్రయాలు, వాడకంపై తీవ్ర ఆంక్షలు అమలులో ఉన్నాయి. 

కరోనా కారణంగా కెనడాలో లాక్‌డౌన్‌ ఉన్నందున ప్రజలెవరూ బయటకురావడం లేదు. ఒకవేళ లాక్‌డౌన్‌ లేకుంటే ప్రాణనష్టం ఇంకా ఎక్కువగా ఉండేది. కనుక లాక్‌డౌన్‌ కారణంగా కూడా అనేకమంది మృత్యువు నుంచి తప్పించుకోగలిగారని చెప్పవచ్చు. కాల్పుల నేపధ్యంలో కెనడా అంతటా లాక్‌డౌన్‌ మరింత కటినంగా అమలుచేస్తున్నారు. ఇంతకీ ఆ దుండగుడు ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడు? అతనికి ఉగ్రవాదులతో ఏమైనా సంబందాలున్నాయా? అనే కోణంలో కెనడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Post