చైనా చేసిన తప్పుకు ప్రపంచం మూల్యం చెల్లిస్తోంది

March 21, 2020
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఎంత సున్నితమైన అంశంపైనైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతారనే విషయం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్‌ గురించి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చేసిన ఓ ట్వీట్‌పై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, “చైనా చేసిన తప్పుకు యావత్ ప్రపంచం మూల్యం చెల్లిస్తోందిప్పుడు. కరోనా వైరస్‌ గురించి చైనా తెలుసుకొన్నప్పుడు వెంటనే దాని గురించి ప్రపంచదేశాలకు తెలియజేసి ఉండాలి కానీ గోప్యత పాటించింది. కనీసం దానిని వూహాన్ నగరం దాటకుండా కట్టడి చేసి ఉండి ఉంటే నేడు ఇంత అనర్ధం జరిగి ఉండేది కాదు,” అని అన్నారు. 

చైనా తెలిసో తెలియకో చేసిన ఆ తప్పుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 145 దేశాలలో సుమారు 2 లక్షలకు పైగా ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. రోజూ వందలాదిమంది చనిపోతున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడింది. రెక్కాడితే కానీ డొక్కాడని పేదప్రజలు కరోనా వైరస్‌ కారణంగా ఉపాధి కోల్పోయీ ఆకలితో అల్లాడుతున్నారు. అనేకదేశాలలో కరోనా కారణంగా వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు మూతపడుతుండటంతో వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. 

యావత్ ప్రపంచం మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చింది కరోనా వైరస్‌ అనే కంటే, దానిని గుట్టుగా దాచి పెట్టేందుకు ప్రయత్నించిన చైనా పాలకులదేనని చెప్పకతప్పదు. ట్రంప్ చెప్పినట్లు కరోనా వైరస్‌ గురించి చైనా ప్రభుత్వం ముందే బయటపెట్టి ఉండి ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నా శాస్త్రవేత్తలు దానికి ఏదో ఓ పరిష్కారం చూపేవారు. అన్ని దేశాలు ముందే జాగ్రత్తపడి ఉండేవి...ఇంత మహావిధ్వంసం జరిగేదే కాదు. కనుక ట్రంప్ చెప్పినట్లు చైనా చేసింది ముమ్మాటికీ క్షమించరాని తప్పే. ఆ మహాతప్పుకు బహుశః ఆర్ధికనిపుణులు కూడా లెక్కకట్టలేరేమో? 


Related Post