అమెరికా-చైనాల మద్య కరోనా యుద్ధం

March 14, 2020
img

చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్‌ పుట్టి అదిప్పుడు ప్రపంచమంతా వ్యాపించిందని అందరికీ తెలుసు. కరోనా పుట్టుక, వ్యాప్తికి మీరే కారణమంటూ అమెరికా-చైనా దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి. చైనా ప్రభుత్వం రహస్యంగా బయోలాజికల్ వెపన్స్ (జీవాయుధాలు) తయారుచేస్తుంటే, ఆ ప్రయోగంలో కరోనా వైరస్‌ బయటకు లీక్ అయ్యి ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించిందని అమెరికా ఆరోపిస్తుంటే, అమెరికా సైనికుల ద్వారానే కరోనా వైరస్‌ చైనాలోకి ప్రవేశించిందని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఓ ట్వీట్ చేశారు. దానిపై అమెరికా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికాలోని చైనా రాయబారి సుయీ టియాంకాయికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. చైనా విదేశాంగ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కోరింది. “కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టిందో యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ ప్రపంచదేశాలను తప్పు దారి పట్టించేందుకు అమెరికాపై నిందలు వేయడం మేము సహించబోము. చైనా వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము,” అని అమెరికా ఆసియా వ్యవహారాల దౌత్యవేత్త డేవిడ్ స్టీల్‌ఫిల్ అన్నారు. కరోనా వైరస్‌ పెద్ద సమస్య కాదన్నట్లు మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, అమెరికాలో కరోనా వైరస్‌ రోగుల సంఖ్య శరవేగంగా పెరుగుతుండటంతో ‘నేషనల్ ఎమర్జన్సీ’ విధిస్తున్నట్లు ప్రకటించారు. 

Related Post