ఈనెలలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ పర్యటన

February 11, 2020
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 24, 25 తేదీలలో ట్రంప్ భారత్‌లో పర్యటించబోతున్నట్లు వైట్ హౌస్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఆయనతో పాటు భార్య మెలానియా కూడా భారత్‌ వస్తున్నారు. ఈ రెండురోజులలో ట్రంప్ దంపతులు డిల్లీ, అహ్మదాబాద్ నగరాలలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భారత్‌-అమెరికాల మద్య పలు వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అలాగే భారత్‌- అమెరికా దేశాల మద్య వాణిజ్య పన్నుల విధింపులో నెలకొన్న వివాదాలు కూడా పరిష్కరించుకొనే అవకాశం ఉంది. అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు, సైనిక సామాగ్రి కొనుగోలు ఒప్పందాలు కూడా మోడీ-ట్రంప్ భేటీలో ఖరారయ్యే అవకాశం ఉంది. కశ్మీర్ సమస్యలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ పదేపదే ప్రకటనలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఈసమావేశంలో భారత్‌ వైఖరిని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేసే అవకాశం ఉంది. అలాగే వ్యూహాత్మక రక్షణ అంశాలపై ఈ పర్యటనలో ఇరుదేశాల ఉన్నతాధికారులు అధికారులు చర్చించనున్నారు. 

డొనాల్డ్ ట్రంప్ భారత్‌ పర్యటనతో భారత్‌-అమెరికా మద్య బందం మరింత బలపడటమే కాకుండా వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆయనకు చాలా లబ్ది పొందే అవకాశం కూడా ఉంది. ఈ ఏడాది నవంబరులో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ పోటీ చేస్తునందున, అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసభారతీయులను మెప్పించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుంది.

Related Post