అమెరికా సరికొత్త ఆంక్షలు

January 24, 2020
img

అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ దేశంలో పుట్టినవారందరికీ అమెరికన్ పౌరసత్వం లభిస్తుంది. కనుక చాలామంది విదేశీయులు తమ పిల్లలకు అమెరికన్ పౌరసత్వం సంపాదించేందుకు ప్రసవానికి అమెరికా వెళ్ళివస్తుంటారు. దీనిని ఓ గొప్ప వ్యాపార అవకాశంగా గుర్తించిన కొన్ని సంస్థలు ‘బర్త్ టూరిజం’ ప్యాకేజీలు రూపొందించి భారీగా సొమ్ము చేసుకొంటున్నాయి కూడా. 

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడాలనుకొంటున్న విదేశీయులను నియంత్రించేందుకు అనేక ఆంక్షలు విధిస్తున్నారు. కేవలం అమెరికాలో జన్మిస్తే  చాలు..అమెరికన్ పౌరసత్వం పొందే వెసులుబాటును కల్పిస్తున్న రాజ్యాంగంలో ఆ నిబందనను రద్దు చేయాలనుకొన్నారు కానీ అది సాధ్యపడదని గ్రహించడంతో అమెరికాలో ప్రసవించడానికి వచ్చే మహిళలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

వాటి ప్రకారం అమెరికాలో ప్రసవానికి వెళ్ళాలనుకొంటున్న గర్భిణీ స్త్రీలు ‘తాము కేవలం ప్రసవం కోసమే వస్తున్నాము తప్ప మరే ఉద్దేశ్యం, ప్రయోజనాలు ఆశించి రావడం లేదని, ప్రసవానికి అయ్యే ఖర్చులకు సరిపడా తమవద్ద తగినంత డబ్బు ఉందని, ప్రసవం జరిగిన తరువాత స్వదేశం తిరిగివెళ్లిపోతామని’ లిఖితపూర్వకంగా హామీ ఈయవలసి ఉంటుంది. తద్వారా భవిష్యత్‌లో వారి పిల్లలు జన్మతః లభించే అమెరికన్ పౌరసత్వం పొందకుండా నివారించవచ్చని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ కొత్త ఆంక్షలు నేటి నుంచే అమలులోకి వస్తాయి. 

వలసవచ్చినవారితోనే అమెరికా ఈ స్థాయికి ఎదిగిన మాట వాస్తవం. అయితే నేటికీ వలసలు ఏమాత్రం తగ్గలేదు. నానాటికీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో కాలుపెడితే చాలు...భోగభాగ్యాలతో, విలాసవంతమైన జీవితం గడపవచ్చనే భ్రమే ఈ వలసలకు ప్రధానకారణం. కనుక ఈ వలసలు అడ్డుకట్టవేయడానికి ట్రంప్ సర్కార్ చేస్తున్న అనేక ప్రయత్నాలలో ఇదీ ఒకటి. ఇది విదేశీయులకు ఆగ్రహం కలిగించవచ్చు కానీ ఒక అమెరికా దృష్టికోణం నుంచి చూసినట్లయితే ఇది సరైన నిర్ణయమేనని అర్ధమవుతుంది.

Related Post