పొమ్మనకుండా పొగపెడుతున్న ట్రంప్

May 27, 2019
img

పొమ్మనకుండా పొగపెట్టడం అంటే ఏమిటో ట్రంప్ సర్కార్‌ను చూస్తే అర్ధం అవుతుంది. ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడే అమెరికాలో స్థిరపడిన విదేశీయులను ఇంటికి పంపించేస్తానని, కొత్తవారి రాకపై ఆంక్షలు విధిస్తానని కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు. అమెరికన్లకు ఉద్యోగాలు, ఉపాది అవకాశాలు పెంచడమే తన లక్ష్యమని విస్పష్టంగా చెప్పారు. చెప్పినట్లుగానే అధికారం చేపట్టగానే హెచ్-1బి వీసాలపై ఆంక్షలు కటినతరం చేశారు. కొన్ని ముస్లిం దేశాల ప్రజలు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విదించారు కూడా.

హెచ్-1బి వీసాలపై వచ్చినవారి జీవితభాగస్వాములకు ఉద్యోగం చేసుకొనే వెసులుబాటు కల్పించే హెచ్-4 వీసాలను నిషేదించడానికి ఇప్పుడు ట్రంప్ సర్కార్ రంగం సిద్దం చేస్తోంది. త్వరలోనే దీనికోసం ఫెడరల్ రిజిస్ట్రీలో నోటిఫికేషన్‌ జారీ చేసి నిబందనల ప్రకారం ఈ ప్రతిపాదనపై రెండునెలలపాటు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు. ఆ తరువాత అమెరికన్ కాంగ్రెస్‌లో హెచ్-4 వీసాలను నిషేదిస్తూ చట్టం చేస్తారు. 

ఈ ప్రక్రియ అంతా అపూర్తవడానికి మరొక 6-12 నెలలు పట్టవచ్చు కానీ అది అమలులోకివస్తే హెచ్-1బి వీసాలపై వచ్చినవారి జీవితభాగస్వాములు ఉద్యోగాలు వదులుకొని ఇళ్లలోనే కూర్చోవలసి ఉంటుంది. అమెరికా జీవనప్రమాణాల ప్రకారం ఒక కుటుంబం సుఖంగా జీవించాలంటే భార్యాభర్తలిద్దరూ తప్పనిసరిగా ఉద్యోగాలు చేయాల్సిఉంటుంది. ఉద్యోగం చేయడం కుదరకపోతే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అవి వద్దనుకొంటే వారి జీవిత భాస్వాములు పిల్లలతో సహా భారత్‌ తిరిగి వచ్చేయవలసి ఉంటుంది. అమెరికాలో పుట్టి పెరిగి అక్కడ జీవనవిధానానికి అలవాటుపడి, అక్కడే చదువుకొంటున్న పిల్లలకు హటాత్తుగా అమెరికా వదిలి భారత్‌ వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్ అవడం చాలా కష్టం. కనుక ట్రంప్ సర్కార్ హెచ్-4 వీసాలు రద్దు చేసినా లేదా ఉద్యోగాలు చేయడంపై నిషేధం విధించినా అమెరికాలో ఉద్యోగాలు చేసుకొంటూ హాయిగా జీవిస్తున్న ప్రవాస భారతీయులు చాలా ఇబ్బందులుపడతారు. 

Related Post