శ్రీలంకలో ఆగని బాంబు ప్రేలుళ్ళు

April 25, 2019
img

శ్రీలంక రాజధాని కొలొంబోలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన వరుస బాంబు ప్రేలుళ్ళు, ఆత్మహుతి దాడులలో ఆప్తులను కోల్పోయి ప్రజలు తల్లడిల్లుతుండగానే ఇంకా వరుస బాంబు ప్రేలుళ్ళు కొనసాగుతున్నాయి.

బుదవారం ఉదయం ఒక సినిమా ధేయేటర్ వద్ద నిలిపి ఉంచిన ఒక బైక్‌లో బాంబు ఉన్నట్లు గుర్తించిన బాంబ్ స్క్వాడ్ దానిని నిర్వీర్యం చేస్తుంటే హటాత్తుగా పేలడంతో వారితో సహా చుట్టుపక్కల కొంతమంది గాయపడ్డారు. మళ్ళీ గురువారం ఉదయం కొలొంబోకు 40 కిమీ దూరంలో పుగోడా అనే పట్టణంలో భారీ బాంబు ప్రేలుడు సంభవించింది. ఈ ప్రేలుడులో ప్రాణనష్టం, గాయపడటం జరిగిందా లేదా అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. 

కొలొంబోలో ఆదివారం జరిగిన వరుసబాంబు దాడులలో చనిపోయిన వారి సంఖ్య 359కు చేరుకొంది. పోలీసులు, భద్రతాదళాలు దేశమంత గాలిస్తున్నప్పటికీ ఇంకా రోజూ బాంబు ప్రేలుళ్ళు కొనసాగుతుండటం గమనిస్తే శ్రీలంకలో ఉగ్రవాదులు చాప క్రింద నీరులా ఎంతగా విస్తరించి ఉన్నారో అర్ధమవుతుంది. శ్రీలంక పోలీసులు ఇప్పటి వరకు 40 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాంబు ప్రేలుళ్లకు పాల్పడుతున్న వారిలో కొందరు విదేశాలలో విద్యనభ్యసించిన ఉన్నత విద్యావంతులు, వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వరుస బాంబు ప్రేలుళ్ళకు భయపడి కొలొంబో...పరిసర ప్రాంతాలలో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. శ్రీలంకలో ఈ పరిస్థితులు ఇంకా ఎప్పటికీ అదుపులోకి వస్తాయో తెలియదు కానీ ఈ ఇంటి దొంగలను గుర్తించి పట్టుకొనేవరకు అందరికీ క్షణక్షణం గండమే.

Related Post