శ్రీలంకలో భయానక ఉగ్రదాడి

April 22, 2019
img

దశాబ్ధాలుగా ఎల్టిటీఈ ఉగ్రవాదంతో రక్తమోడ్చిన శ్రీలంకలో మళ్ళీ నిన్న (ఆదివారం) రక్తపుటేరులు పారాయి. ఆదివారం ఉదయం దేశరాజధాని కొలంబోలో ఒకేసారి 8 ప్రాంతాలలో జరిగిన వరుస బాంబు ప్రేల్లుళ్ళలో 215 మంది అక్కడికక్కడే మృతి చెందారు మరో 5-600 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో భారతీయులతో సహా మొత్తం 33 మంది విదేశీయులు చనిపోయారు. వందలాదిమంది గాయపడ్డారు. ఈ ప్రేలుళ్ళన్నీ చర్చిలలో, విదేశీయులు ఎక్కువగా బస చేసే స్టార్ హోటల్స్ లో జరిగాయి. కానీ ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ ప్రేలుళ్ళకు తామే బాధ్యులమని ప్రకటించుకోకపోవడంతో ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారో తెలియడం లేదు. 

పవిత్ర ఈస్టర్‌ సందర్భంగా ఆదివారం కొలంబోలోని సెయింట్ ఆంటోనీస్ చర్చిలో ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో ఉదయం 8.45 గంటలకు మొదటి ప్రేలుడు జరిగింది. ఆ తరువాత వరుసగా బట్టికలోవాలోని జియోన్ చర్చిలో, నెగోంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలలో వరుసగా ప్రేల్లుళ్ళు జరిగాయి. ఈస్టర్ ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొనేందుకు వందలాదిమంది క్రైస్తవ భక్తులు తరలివస్తారని తెలిసి వారినే లక్ష్యంగా చేసుకొని భారీమారణహోమం సృష్టించాలనే ఉద్దేశ్యంతో మూడు చర్చీలలో ముందే అమర్చిన బాంబులను ప్రేల్చడంతో చర్చీలో ఉన్నవారిలో చాలా మంది చనిపోయారు. వారి శరీరావయాలు తునాతునకలుగా తెగి పడ్డాయి. శాంతి సందేశం వినిపించే పవిత్రస్థలం బాధితుల హాహాకారాలతో మారుమ్రోగిపోయింది. 

చర్చిలతో పాటు కొలొంబోలోని ద షాంగ్రిల, ద సినామన్ గ్రాండ్, ద కింగ్స్ బరీ స్టార్ హోటల్స్ లలో కూడా బాంబులు పేలడంతో వాటిలోను అనేకమంది చనిపోయారు. శ్రీలంకలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన ప్రముఖ నటి రాధిక ఆ సమయంలో సిన్నామన్ గ్రాండ్ హోటల్లోనే ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు ప్రేలుడు జరిగే కొన్ని క్షణాల ముందే ఆమె రూమ్ ఖాళీ చేసి బయలుదేరిపోవడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. 

ఈ ప్రేలుళ్ళ షాక్ నుంచి దేశప్రజలు తేరుకోకమునుపే మళ్ళీ మధ్యాహ్నం కొలొంబో శివార్లలో గల ఒరుగోదవట్టాలో , దెహీవాలా జంతుప్రదర్శనశాల సమీపంలో ఆత్మహుతి దాడులు జరిగాయి. ఆ ప్రాంతాలలో ఉగ్రవాదులున్నట్లు గుర్తించిన భద్రతాదళాలు అక్కడకు చేరుకొని వారిని చుట్టుముట్టడంతో ఇద్దరు ఉగ్రవాదులు తమనుతాము పేల్చేసుకొని ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు భద్రతాసిబ్బంది చనిపోయారు. 

ఈ ప్రేలుళ్ళకు ఎవరు కారణమో ఇంకా తెలియలేదు కానీ శ్రీలంక భద్రతాదళాలు 11 మంది అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నాయి. ప్రేలుళ్ళు జరిగిన వెంటనే  శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్‌ విక్రమసింఘేలు, భద్రతాదళాధికారులు, మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. రెండు రోజుల పాటు కొలొంబోలో స్కూళ్ళు, యూనివర్సిటీలు, అన్ని విద్యాసంస్థలకు శలవులు ప్రకటించారు. 

ఈ దాడులకు పాల్పడినవారిని పట్టుకొనేందుకు భద్రతాదళాలు, నిఘా బృందాలు కొలోమ్బోతో సహా దేశ వ్యాప్తంగా గాలింపు మొదలుపెట్టాయి. 

శ్రీలంకలో జరిగిన ఈ దారుణంపై ప్రపంచదేశాలన్నీ ఖండించాయి. తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. శ్రీలంక ప్రభుత్వానికి ఎటువంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్దంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ ప్రధాని నరేంద్రమోడీ తెలియజేశారు. 


Related Post