ప్రతీకారచర్యలకు దిగొద్దు: పాక్‌కు అమెరికా హెచ్చరిక

February 27, 2019
img

పాక్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల కారణంగా భారత్‌-పాక్‌ మద్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా స్పందన భారత్‌కు అనుకూలంగా ఉండటం విశేషం. భారత్‌పై ప్రతీకారదాడులు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాక్‌ పాలకులను అమెరికా గట్టిగా హెచ్చరించింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీతో ఫోన్లో మాట్లాడారు. 

ఇప్పుడు ముందుగా చేయవలసింది భారత్‌పై ప్రతీకరదాడులు కాదు...పాక్‌లో తిష్టవేసుకొని కూర్చోన్న ఉగ్రవాదమూకలను ఏరిపారేయడం. వారిపై పాక్‌ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. అదేసమయంలో భారత్‌ విషయంలో పాక్‌ సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలు పెంచే ఎటువంటి చర్యలకు పాల్పడరాదని పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీని గట్టిగా హెచ్చరించానని మైక్ పాంపియో స్వయంగా మీడియాకు చెప్పారు.   

భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కూడా మాట్లాడానని తెలిపారు. భారత్‌-అమెరికాల రక్షణపరమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే ఉపఖండంలో శాంతిభద్రతలు కాపాడాలనే తమ ఉమ్మడి లక్ష్యం గురించి ఆమెతో చర్చించామని తెలిపారు. భారత్‌ కూడా సంయమనం పాటించాలని కోరినట్లు తెలిపారు. 

భారత వాయుసేన వాస్తవధీన రేఖను దాటి పాక్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినప్పటికీ అమెరికా పాక్‌ పాలకులను హెచ్చరించడం భారత్‌ చర్యలకు పరోక్షంగా మద్దతు తెలుపడమే. కనుక త్వరలో మిగిలిన అగ్రరాజ్యాలు కూడా భారత్‌కు సంఘీభావం తెలిపే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో భారత్‌పై నేరుగా ప్రతీకారదాడులు చేసేందుకు పాక్‌ సాహసించకపోవచ్చు. కానీ తీవ్ర అవమానంతో , ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న పాక్‌ భారత్‌లోని ప్రధాననగరాలలో ఉగ్రవాదదాడులు, జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాదుల ద్వారా అరాచకం సృష్టించే ప్రయత్నాలు గట్టిగా చేయవచ్చు. కేంద్రప్రభుత్వం ఇప్పటికే , రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండటం మంచిది. వీలైనంత వరకు రద్దీగా ఉండే ప్రాంతాలలో, దాడులకు ఆస్కారం ఉందని అనుమానం ఉన్న ప్రాంతాలకు వీలైతే దూరంగా ఉండటం మంచిది. 

Related Post