యుస్‌లో విద్యార్ధులను విడిపించేందుకు అధికారులు ప్రయత్నాలు

February 02, 2019
img

అమెరికాలో ఉన్నతాభ్యాసం పేరుతో నకిలీ వీసాలతో ఉద్యోగాలు చేసుకొంటున్న 200 మంది విదేశీయులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో 129 మంది భారతీయ విద్యార్ధులే. టెక్సాస్ జైలులో నిర్బందించిన వారిని విడిపించేందుకు ఇప్పటికే ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ విద్యార్ధుల తల్లితండ్రులు, కుటుంబ సభ్యులా అభ్యర్ధన మేరకు అమెరికాలోని భారత ఎంబసీ అధికారులు కూడా వారిని విడిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ఆ విద్యార్ధులకు, వారి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులకు సమాచారం కోసం ఎంబసీ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే ఒక హాట్ లైన్ ఏర్పాటు చేసి, వారందరికీ తగిన సమాచారం అందించేందుకు ఒక నోడల్ అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భారత ఎంబసీ అధికారులు గురువారం టెక్సాస్ వెళ్ళి నిర్బందంలో ఉన్న ఆ విద్యార్ధులను కలిసి ధైర్యం చెప్పి వచ్చారు. వారిని విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. వారిని విడిపించి స్వదేశానికి పంపించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఎఫ్.బి.ఐ. నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఇప్పటివరకు 200 మంది పట్టుబడ్డారు. కానీ ఈవిషయం బయటకు పొక్కడంతో నకిలీ వీసాలపై ఉద్యోగాలు చేసుకొంటున్నవారు అప్రమత్తం అయ్యుంటారు కనుక వారిని కూడా పట్టుకోవడానికి ఎఫ్.బి.ఐ. ప్రయత్నాలు చేయవచ్చు. కనుక రానున్నరోజులలో ఇంకా అనేకమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దేశంకాని దేశంలో ఇటువంటి దయనీయ పరిస్థితులలో చిక్కుకోకూడదనుకుంటే, భారతీయ యువతీ యువకులు ముందుగా అమెరికా వ్యామోహం నుంచి బయటపడాలి. ఇప్పటికే అమెరికాలో నకిలీ వీసాలతో ఉద్యోగాలు చేసుకొంటున్నవారు వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి వచ్చేయడం మంచిది. అటువంటి వారికి అమెరికాలోని భారతీయ సంఘాలు అవసరమైన న్యాయ సహాయసహకారాలు అందించడానికి సిద్దంగా ఉన్నాయి.

Related Post