టాటా అధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు

October 31, 2018
img

అమెరికాలో స్థిరపడిన మన తెలంగాణవాసులు స్వదేశానికి దూరంగా ఉంటున్నప్పటికీ మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకొంటూ తమ భవిష్యతరాలకు కూడా వాటి గొప్పదనం గురించి తెలియజేయడానికి పడే తపన చాలా అభినందనీయం. గ్రేటర్ ఫిలడెల్ఫియా కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) అధ్వర్యంలో ప్రతీ ఏటా దసరా సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. ఈసారి కూడా దసరా పండుగ సందర్భంగా ‘టాటా’ ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది.  ఈ కార్యక్రమాలకు పెన్సిల్వేనియా మరియు డెలావేర్, న్యూజెర్సీ, న్యూయార్క్, మేరీల్యాండ్, వర్జీనియా, ఫ్లోరిడా, టెక్సాస్, వాషింగ్టన్, జార్జియా, దక్షిణ కరోలినా మరియు మస్సాచుసెట్స్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 800 మంది ప్రవాస తెలంగాణవాసులు హాజరయ్యి మన సంస్కృతీ సాంప్రదాయాలపట్ల వారికున్న గౌరవం, అభిమానం చాటుకున్నారు. 


అంగరంగ వైభవంగా సాగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో సుమారు 100 మంది తమ పాటలతో, నృత్య ప్రదర్శనలతో అందరినీ అలరించారు. మహిళలు, పిల్లలు అందరూ కలిసి భక్తిశ్రద్దలతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. అనంతరం నోరూరించే తెలంగాణ పిండివంటలతో, దక్షిణాది రాష్ట్రాల వంటకాలతో ఏర్పాటు చేసిన విందుభోజనాలను అందరూ ఆస్వాదించారు. 

ఈ కార్యక్రమాలకు పెన్సిల్వేనియా హౌస్ ప్రతినిధి శ్రీ వారెన్ కంప్ఫ్ ముఖ్య అతిధిగా, ఫొనిక్స్ విలే మేయర్ శ్రీ పీటర్.జె. ఉర్స్ చెలర్ గౌరవ అతిధిగా పాల్గొన్నారు. 

టాటా సలహా మండలి చైర్ మరియు ఛైర్మన్ శ్రీ డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి, టాటా సలహా మండలి కో-చైర్ మరియు అధ్యక్షులు శ్రీ హరనాథ్ పొలిచెర్ల,  టాటా ప్రధాన కార్యదర్శి శ్రీ విక్రమ్ జనగాం, టాటా సలహా మండలి సభ్యులు శ్రీ మోహన్ పాటోళ్ళ, శ్రీ విజయ్ పాల్ రెడ్డి, టాటా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ భరత్ మదాడి, టాటా జాయింట్ కోశాధికారి శ్రీమతి జ్యోతిరెడ్డి మరియు టాటా సంస్థలో సభ్యులు, ఇతర దేశాలకు చెందిన కొందరు ప్రతినిధులు, స్థానికసంస్థల ప్రతినిధులు ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యారు. 


ముఖ్య అతిథి శ్రీ వారెన్ కంప్ఫ్ మరియు గౌరవ అతిధి శ్రీ పీటర్ మరియు.జె. ఉర్స్ చెలర్ ఈ కార్యక్రమాలకు హాజరయినవారిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, జాతుల ప్రజలందరూ అమెరికాలో కలిసిమెలిసి ఇంత సంతోషంగా జీవిస్తుండటం తమకు చాలా ఆనందం కలిగిస్తోందని అన్నారు. దసరా సందర్భంగా వారివురూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 

టాటా చైర్మన్ డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి, టాటా అధ్యక్షులు శ్రీ డాక్టర్ హరనాధ్ పోలిచెర్ల తదితరులు కూడా ఆహుతులందరికీ   శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టాటా సంస్థ అధ్వర్యంలో అమెరికాలో వివిద రాష్ట్రాలలో ఏటా బతుకమ్మ మరియు దసరా వేడుకలు ఏవిధంగా నిర్వహిస్తున్నారో వారు వివరించారు. ఈ కార్యక్రమాలు ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన టాటా గ్రేటర్ ఫిలడెల్ఫియా బృందానికి అభినందనలు తెలియజేశారు. 

టాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీ సురేష్ వెంకన్నగారి, మీడియా  చైర్ వంశీ గుల్లపల్లి, ప్రాంతీయ ఉపాధ్యక్షులు ప్రసాద్ కునారపు, శ్రీ రమణ కొత్త, శ్రీ భాస్కర్ పిన్న, శ్రీ వేణు ఏనుగుల, ప్రాంతీయ సమన్వయకర్తలు శ్రీ ప్రణీత్ రెడ్డి, శ్రీ శషి కాసిర, శ్రీ అమర్ వేముల, శ్రీ కిరణ్ గూడూరు, శ్రీ జనార్ధన్, టాటా ప్రొఫెసర్ కోదండరామ్ జట్టు సభ్యులు శ్రీ బద్దం, శ్రీ సతీష్ సుంకనపల్లి, శ్రీ రాజేష్ ఆలేటి, శ్రీ స్వామి బొడ్గి, శ్రీ వేణు బత్తిని, శ్రీమతి సుమన్ మూడుంబ, శ్రీమతి స్మితా పెద్దిరెడ్డి శివారెడ్డి, తదితరులు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి చేసిన కృషిని అందరూ అభినందించారు. 

ఈ కార్యక్రమాలకు అమెరికాలో టాప్-500 ఐ‌టి కంపెనీలలో ఒకటిగా నిలిచిన స్ప్రూస్ ఇన్ఫోటెక్ స్పాన్సర్ చేసింది. మన అభిమాన వెబ్ సైట్ 'మైతెలంగాణ.కామ్' ఈ కార్యక్రమాలకు అధికారిక మీడియా సంస్థలలో ఒకటిగా నిలిచింది.

Related Post