మళ్ళీ పిటిషన్ వేసిన ఐ‌టి సర్వ్ అలయన్స్

October 12, 2018
img

అమెరికాలో సుమారు 1000కి పైగా ఐ‌టి కంపెనీలు కలిసి ఏర్పాటు చేసుకొన్న సంస్థ ఐ‌టి సర్వ్ అలయన్స్. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఐ‌టి కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తున్న సంస్థ ఐ‌టి సర్వ్ అలయన్స్. యు.ఎస్.సి.ఐ.ఎస్. (యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసస్) హెచ్-1 బి వీసాల జారీ ప్రక్రియలో అనుసరిస్తున్న అనుచిత విధానాలను సవాలు చేస్తూ ఐ‌టి సర్వ్ అలయన్స్ డల్లాస్ లోని టెక్సాస్ కోర్టులో ఈనెల 10 వ తేదీన ఒక పిటిషను వేసింది.

ఐ‌టి సర్వ్ అలయన్స్ (అమెరికా) జాతీయ అధ్యక్షుడు గోపీ కందుకూరి దీని గురించి మీడియాతో మాట్లాడుతూ, “హెచ్-1 బి వీసాల జారీ ప్రక్రియలో యు.ఎస్.సి.ఐ.ఎస్. గత 8 ఏళ్లుగా ఒక నిర్ధిష్టమైన విధానం అంటూ లేకుండా వ్యవహరిస్తూ, వీసాల కోసం దరఖాస్తు చేసుకొన్నవారిని ముప్పాతిప్పలు పెడుతోంది. హెచ్-1 బి వీసాలకు దరఖాస్తులు చేసుకొంటే వాటికి సరైన కారణాలు చూపకుండానే యు.ఎస్.సి.ఐ.ఎస్. పదేపదే తిరస్కరిస్తుండటంతో దాని ధోరణితో మేమంతా విసుగెత్తిపోయున్నాము. కనుక ఈ సమస్యపై మేము నిత్యం యు.ఎస్.సి.ఐ.ఎస్.తో పట్లుపట్టడం కంటే ఫెడరల్ కోర్టులో తేల్చుకోవడమే మంచిదని భావించాము. అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంట్) నిర్దేశించిన విధివిధానాలను అది ఖచ్చితంగా పాటించేలా చేసి వాటికి అది బాధ్యత వహించేలా చేయడమే మా ప్రధానోద్దేశ్యం. అందుకే కోర్టులో పిటిషన్ వేశాము,” అని చెప్పారు.

ఎఫ్-1 వీసాలపై వచ్చిన ఎస్.టి.ఈ.ఎం.(స్టెమ్) విదేశీ విద్యార్ధులు ధర్డ్ పార్టీ కంపెనీలలో పనిచేయకూడదంటూ   యు.ఎస్.సి.ఐ.ఎస్. విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ ఐ‌టి సర్వ్ అలయన్స్ ఈ ఏడాది జూలైలో ఫెడరల్ కోర్టులో పిటిషను వేసి ఆ నిర్ణయాన్ని అది వెనక్కు తీసుకొనేలా చేయగలిగామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.    

ఐ‌టి సర్వ్ అలయన్స్ దాఖలు చేసిన ఈ తాజా పిటిషనులో యు.ఎస్.సి.ఐ.ఎస్.వలన తమకు ఎదురవుతున్న సమస్యలనన్నిటినీ పేర్కొని తమకు న్యాయం చేయాలని కోరింది. 

హెచ్-1 వీసాలకు కనీస కాలపరిమితి మూడేళ్ళని అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయించి ఆమేరకు కార్మికశాఖకు మార్గదర్శకాలు జారీ చేస్తే, యు.ఎస్.సి.ఐ.ఎస్. మూడేళ్ళ కంటే తక్కువ కాలపరిమితి కలిగిన హెచ్-1 వీసాలను మంజూరు చేసే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని ఫిర్యాదు చేసింది. వాటిలో అనేకం కొన్ని నెలలకు లేదా రోజులకు మాత్రమే పరిమితం చేస్తోందని పిటిషనులో పేర్కొంది. కొన్నిసార్లు ఆ వీసాల మంజూరు చేసే సమయానికే వాటి గడువు పూర్తయిపోతోందని ఐ‌టి సర్వ్ అలయన్స్ తాజా పిటిషనులో పేర్కొంది. ఈ వీసాల దరఖాస్తు చేసుకొంటున్నవారు దరఖాస్తులలో తమ ప్రయాణ వివరాలను పేర్కొనాలని కోరడం కూడా చట్ట వ్యతిరేకమేనని పిటిషనులో పేర్కొంది.

హెచ్-1బి వీసాల జారీలో చట్టం నిర్దేశించిన నియమనిబందనలకు యు.ఎస్.సి.ఐ.ఎస్. తనకు తోచినట్లు బాష్యం చెప్పుకొంటూ, సరళతరమైన వీసాల జారీ విధానాన్ని ఒక పెద్ద సమస్యగా మార్చివేసిందని పేర్కొంది. యు.ఎస్.సి.ఐ.ఎస్. యధేచ్చగా వాటిని ఉల్లంఘింస్తోందని ఐ‌టి సర్వ్ అలయన్స్ తన పిటిషనులో న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. ఒక రాజ్యాంగసంస్థ అయిన యు.ఎస్.సి.ఐ.ఎస్. ఈవిధంగా ప్రభుత్వ నియమనిబందనలకు,  మార్గదర్శకాలకు వక్రబాష్యం చెపుతూ ఉల్లంఘించడానికి వీలులేదని, కనుక వీసాల జారీలో ఇక నుంచి చట్టంలో సూచించిన విధంగా నిర్ధిష్టమైన విధివిధానాలు అమలు చేసేలా యు.ఎస్.సి.ఐ.ఎస్. ఆదేశించాలని ఐ‌టి సర్వ్ అలయన్స్ న్యాయస్థానాన్ని కోరింది.

Related Post