భారత్ మాట అమెరికా వింటుందా?

May 29, 2018
img

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికన్లకే ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించేందుకు హెచ్-1 బి వీసాల జారీని కటినతరం చేశారు. ఉద్యోగాల కోసం అమెరికాకు రావాలనుకొంటున్నవారికి ఒకపక్క అడ్డుకట్ట వేస్తూనే, మరోపక్క చిరకాలంగా అమెరికాలో స్థిరపడినవారిని బయటకు పంపించడానికి పొగపెడుతున్నారు. దానిలో భాగంగానే హెచ్-4 వీసాలను నిలిపివేయాలని నిర్ణయించారు. 

సాధారణంగా అమెరికాలో స్థిరపడినవారి జీవిత భాగస్వాములు హెచ్-4 వీసాలతోనే అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటారు. ఆవిధంగా ఉద్యోగాలు చేస్తున్నవారిలో మన దేశానికి చెందినవారే సుమారు 65,000 మందికి పైగా ఉన్నారని ఒక అంచనా. ట్రంప్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం అమలులోకి వస్తే వారందరూ ఇక ఉద్యోగాలు చేయలేరు కనుక ఇంటికే పరిమితం కావలసి ఉంటుంది. 

ప్రస్తుత పరిస్థితులలో మన దేశంలోనే భర్త ఒక్కడే ఉద్యోగం చేస్తే ఇల్లు గడవని పరిస్థితి నెలకొని ఉంది. ఇక అమెరికాలో చెప్పక్కరలేదు. అమెరికాలో జీవనప్రమాణాలకు తగ్గట్లుగా జీవించాలంటే భార్యభర్తలిద్దరూ పనిచేయక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ చేయలేకపోతే తప్పనిసరిగా భార్య, పిల్లలు భారత్ తిరిగిరావలసి ఉంటుంది. కనుక హెచ్-4 వీసాలను నిషేదించడంపై అమెరికాలో స్థిరపడిన ప్రవాసభారతీయులు ఆందోళన చెందుతున్నారు.

ఈ సమస్యపై భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ, హెచ్-4 వీసాలను నిషేదించవద్దని ట్రంప్ సర్కార్ కు నచ్చజెప్పేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాము. కనుక అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.  

కానీ భారత్ మాటను డోనాల్డ్ ట్రంప్ వింటారని ఆశించడం అత్యాసే అవుతుంది. విదేశీయులను, విదేశీ సంస్థలకు అడ్డుకట్ట వేసి అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తాననే హామీతోనే అయన అమెరికా అధ్యక్షుడు కాగలిగారు. అది అమలుచేసి చూపితేనే మళ్ళీ రెండవసారి అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయ్యే అవకాశం లభిస్తుంది. కనుక ఆ హామీని నిలబెట్టుకునేందుకే ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేయవచ్చు.

Related Post