హెచ్-1బి వీసాలపై ఆ ఆంక్షలు ఎందుకు?

May 03, 2018
img

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే ఆ దేశంలో స్థిరపడిన, అక్కడ ఉద్యోగాల కోసం వస్తున్న విదేశీయులను తగ్గించుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలోనే హెచ్-1 బి వీసాల జారీపై కటినమైన ఆంక్షలు విధించారు. ఇంకా విధిస్తూనే ఉన్నారు. నిరుద్యోగ అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలనే అయన ఆలోచనను ఎవరూ తప్పు పట్టడం లేదు కానీ కనీసం ఒక 5 ఏళ్ళు వ్యవధి పెట్టుకొని చేయవలసిన ఈ పనిని రాత్రికి రాత్రే పూర్తి చేసేసి విదేశీయులు అందరినీ పంపేయాలన్నట్లు ట్రంప్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలనే అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

ఆ ప్రయత్నాలలో భాగంగానే యుఎస్.ఇమ్మిగ్రేషన్ సర్వీసస్ సంస్థ హెచ్-1 బి వీసాలపై ఆంక్షలను మరింత కటినతరం చేసింది. ఒక సంస్థలో హెచ్-1 బి వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులను వేరే సంస్థలకు(ధర్డ్ పార్టీ) సేవలు అందించేందుకు పంపించరాదని ఆంక్షలు విధించింది. అలాగే హెచ్-1 బి వీసా ఉద్యోగుల జీవిత భాగస్వాములు (హెచ్-4 వీసా హోల్డర్లు) ఉద్యోగాలు, వ్యాపారాలు చేయకూడదనే ప్రతిపాదన చేసింది.

అమెరికాలో వివిధ దేశాల ఐటి సంస్థలున్నాయి. అవి హెచ్-1 బి వీసాల ద్వారా ఐటి నిపుణులను తీసుకొని అమెరికాలో వివిధ సంస్థలకు సేవలు అందిస్తుంటాయి. కానీ తాజా అంక్షల కారణంగా ఒక సంస్థ మరొక సంస్థకు ఐటి సేవలు అందించలేని దుస్థితి ఏర్పడింది. అప్పుడు హెచ్-1 బి వీసా ఉద్యోగులను స్వదేశాలకు తిప్పి పంపించేసి వారి స్థానంలో అమెరికన్ ఐటి నిపుణులను తీసుకోవలసి ఉంటుంది. కానీ ఆ సంస్థలు ఇచ్చే జీతాలకు  అమెరికన్ ఉద్యోగులు పనిచేయలేరనేది బహిరంగ రహస్యం. వారికి సరిపడినంత జీతాలు చెల్లించాలంటే, చిన్న, మీడియం కంపెనీలు మూతపడటం ఖాయం. పైగా భారత్, చైనా, తైవాన్, ఫిలిపిన్స్ తదితర దేశాల ఐటి నిపుణులు కష్టపడినట్లుగా అమెరికన్లు కష్టపడలేరనేది బహిరంగ రహస్యమే. కనుక హెచ్-1 బి వీసాలపై ఎన్ని ఆంక్షలు విదిస్తున్నప్పటికీ అనేక సంస్థలు వాటి ద్వారానే ఉద్యోగులను నియమించుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. కానీ ఇప్పుడు అలాగ నియమించుకొన్నా వారి సేవలను ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కనుక కంపెనీలు మూతపడే పరిస్థితి దాపురించిందని అమెరికాలో సుమారు 300 సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న  ‘స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ కన్సోరిటియం’ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

ఆ సంస్థలన్నిటి తరపున ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలలో నిపుణుడు, ప్రముఖ న్యాయవాది ధామస్ విను ఎలెన్ న్యూజెర్సీలోని నెవార్క్, యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో యుఎస్.ఇమ్మిగ్రేషన్ సర్వీసస్ సంస్థ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. 

దాని తాజా ఆంక్షల కారణంగా అనేక ఐటి సంస్థలు ఇతర సంస్థలతో చేసుకొన్న ఒప్పందాల ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందని, తత్ఫలితంగా ఐటి సంస్థలు వాటిపై ఆధారపడిన వేలాదిమంది ఉద్యోగాలు, వారి కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడుతుందని పిటిషనులో పేర్కొన్నారు. యుఎస్.ఇమ్మిగ్రేషన్ సర్వీసస్ సంస్థ తన పరిధిని అతిక్రమించి తీసుకొంటున్న ఇటువంటి నిర్ణయాల వలన ఐటి రంగం పెను సంక్షోభంలో చిక్కుకొనే ప్రమాదం ఉందని ధామస్ విను ఎలెన్ వాదించారు. యుఎస్.ఇమ్మిగ్రేషన్ సర్వీసస్ సంస్థ హెచ్-1 బి వీసాల జారీకి ఉన్న నిబంధనలకు చెపుతున్న కొత్త బాష్యాల వలన ఐటి సంస్థలు పనిచేయలేని పరిస్థితి ఏర్పడిందాని అన్నారు. కనుక అది జారీ చేసిన తాజా ఆదేశాలను నిలిపివేయాలని ధామస్ విను ఎలెన్ న్యాయస్థానాన్ని కోరారు. మరి కోర్టు తీర్పు ఏవిధంగా వస్తుందో, అప్పుడు ట్రంప్ సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. ఆ సంగతి పక్కనపెడితే, అమెరికాలోని విదేశీ సంస్థలు దీనితో ట్రంప్ సర్కార్ పై ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించినట్లే భావించవచ్చు. 

Related Post