వెల్ కమ్ టు సౌదీ అరేబియా

March 14, 2018
img

సౌదీ అరేబియా అంటే కటినమైన నియమనిబంధనలు, ఆంక్షలు, చట్టాలకు మారుపేరు. ఆ దేశంలో ఎక్కడా సినిమా థియేటర్లు కనబడవు. బాలబాలికలు కలిసి చదువుకోవడానికి వీలులేదు. మహిళలకు ఆస్తి హాక్కు కాదు గదా కనీసం కారు డ్రైవింగ్ చేయడానికి కూడా అనుమతి ఉండదు. వారికి ప్రభుత్వంలో, ఉద్యోగాలలో, క్రీడలలో అన్ని రంగాలలో కటినమైన ఆంక్షలుంటాయి కనుక సౌదీ మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇక త్రాగుడు, జూదం, వ్యభిచారం, దొంగతనం వంటివన్నీ క్షమార్హం కాని నేరాలుగా పరిగణింపబడతాయి కనుక వాటికి చాలా కటినమైన  శిక్షలు అమలుచేయబడతాయి. తప్పు చేస్తే యువరాజుకైనా మరణశిక్ష తప్పదని నిరూపించి చూపిన ఏకైక దేశం సౌదీఅరేబియా. కనుక ఆ దేశంలో నేరాలు చాలా తక్కువ. మరో విధంగా చెప్పాలంటే సౌదీఅరేబియా ఒక సువిశాలమైన బహిరంగ జైలు వంటిదనే వాదన కూడా వినబడుతూంటుంది. ఈ పరిస్థితుల కారణంగా సౌదీఅరేబియాలో అనేక గొప్ప పర్యాటక కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిని సందర్శించడానికి ఎవరూ సాహసం చేయరు. సౌదీకి ఉద్యోగాల కోసం లేదా హాజ్ యాత్ర కోసం వెళ్ళేవారు మాత్రమే ఎక్కువగా కనబడుతుంటారు. కనుక ఇంతకాలంగా ప్రభుత్వం కూడా వారికి మాత్రమే వీసాలు మంజూరు చేస్తుండేది.  

కానీ గత కొంతకాలంగా సౌదీ ప్రభుత్వం అన్ని రంగాలలో సంస్కరణలు అమలుచేస్తోంది. ముఖ్యంగా చిరకాలంగా తీవ్ర వివక్షకు గురవుతున్న మహిళలకు అన్ని రంగాలలో పురుషులతో సమానావకాశాలు కల్పిస్తోంది. దుబాయ్ వంటి చిన్న దేశంలో ఎటువంటి చమురు నిలువలు, ఉత్పత్తి లేకపోయినప్పటికీ కేవలం పర్యాటక రంగంపై వస్తున్న రాబడితో సంపన్నదేశాలలో ఒకటిగా నిలుస్తోంది. కనుక ఇకపై తాము కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకొని ఆదాయాన్ని పెంచుకోవాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రయత్నాలలో భాగంగానే ముస్లిమేతరులకు టూరిస్ట్ వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. అయితే ముస్లిమేతరులకు మక్కా మసీదు వంటి ప్రాంతాలకు అనుమతించరు. విదేశీ మహిళలకు కూడా టూరిస్ట్ వీసాలు మంజూరు చేస్తోంది కానీ షరా మామూలుగానే వారి వెంట తప్పనిసరిగా ఒక కుటుంబ సభ్యుడు (పురుషుడు) తోడుగా రావలసి ఉంటుంది. 

Related Post