ఇద్దరు మహా వ్యాపారుల సమావేశం రేపే

June 24, 2017
img

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా ఆయనను ఆదివారం కలుసుకోబోతున్నారు. విశేషం ఏమిటంటే ఇద్దరూ మంచి వ్యాపార లక్షణాలు ఉన్నవారే. కనుక వారి సమావేశం రెండు దేశాలకు ఎంత లాభం కలిగిస్తుందో లెక్కలు వేసి చూసుకోక తప్పదు.  

సాధారణంగా అటువంటి సమావేశాలకు ముందు ఇరుదేశాలు సహృద్భావా వాతావరణం సృష్టించేందుకు దౌత్యపరంగా అనేక చర్యలు, ప్రకటనలు చేస్తుంటాయి. ఈసారి అమెరికా మనం ఊహించిన దానికంటే చాలా బాగానే స్పందించింది. ఈ సమావేశంలో అత్యాధునిక డ్రోన్ల సరఫరా గురించి ట్రంప్ ను మోడీ అడుగబోతున్నారనే వార్తలపై అమెరికా ప్రభుత్వం స్పందిస్తూ భారత్ కోరిన విధంగా డ్రోన్ లను సరఫరా చేస్తామని భారత్ కు రెండు రోజుల క్రితమే సమాచారం పంపింది. ఇదివరకు బారక్ ఒబామా అధికారంలో ఉన్నప్పుడే వాటి కోసం భారత్ ప్రయత్నాలు చేసింది. అప్పుడు ఒబామా సానుకూలంగా స్పందించారు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటికి బ్రేకులు పడ్డాయి. కానీ ఇప్పుడు అడగకుండానే వాటిని సరఫరా చేస్తామని అమెరికా సందేశం పంపించడం ద్వారా భారత్ తో బలమైన సంబంధాలు కోరుకొంటోందని స్పష్టమైన సంకేతాలు పంపించింది. అయితే వాటి సరఫరా వలన అమెరికా చాలా బారీ లాభం కలుగుతుంది. 

ఇక మోడీ ప్రస్తావించబోయే మరో అంశం భారత్ కు హెచ్1-బి వీసాల మంజూరు. దానిపై కూడా అమెరికా ఈరోజు సానుకూల ప్రకటన చేసింది. ఇంతవరకు వాటి కోసం భారత్ నుంచి అభ్యర్ధనలు, లేఖలు రాలేదని కానీ ఒకవేళ రేపు ప్రధాని నరేంద్ర మోడీ వాటి గురించి ఏమైనా ప్రస్తావిస్తే తప్పకుండా సానుకూలంగా స్పందిస్తామని వైట్ హౌస్ ప్రతినిధి చెప్పారు. హెచ్1-బి వీసాల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ నుంచి ఏమైనా గట్టి హామీ రాబట్టగలిగితే భారతీయులకు, భారత్ ఐటి కంపెనీలకు చాలా మేలు కలుగుతుంది. ఒకవేళ ఈ విషయంలో ఉపశమనం లభించినప్పటికీ హెచ్1-బి వీసాలపై ఆధారపడటం వీలైనంత త్వరగా మానుకోవడం మంచిది. ట్రంప్ ఇచ్చిన షాకులను ఒక గుణపాఠంగా భావించి ఈ బఫర్ టైంలో భారత్ ఐటి కంపెనీలు స్వావలంబన సాధించడం ద్వారా అమెరికా మీద ఆధారపడటం తగ్గించుకొంటే చాలా మంచిది.     


Related Post