అవును! మన తెలంగాణ జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యనే మనం అవమానించుకున్నాము. మన కళాకారులు, వారి గొప్పదనం, ప్రతిభ గురించి అందరికీ తెలిసేందుకు జీహెచ్ఎంసీ హైదరాబాద్, ఎల్బీ నగర్‌లో మెట్రో పిల్లర్‌పై దర్శనం మొగులయ్య చిత్రాన్ని గీయించింది.
కానీ దానిపై కొన్ని సంస్థలు తమ వ్యాపార ప్రకటనల పోస్టర్స్ అంటించాయి. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, చివరికి ప్రతీరోజూ ఆ ప్రాంతంలో రాకపోకలు సాగించే ప్రజలు కూడా పట్టించుకోలేదు.
తుర్కయాంజాల్ సమీపంలో నివాసం ఉంటున్న దర్శనం మొగులయ్య రెండు రోజుల క్రితం ఎల్బీ నగర్ వద్ద ఆస్పత్రికి వెళ్ళి తిరిగి వెళుతుండగా మెట్రో పిల్లర్‌పై తన చిత్రం మీద వ్యాపార ప్రకటనల పోస్టర్స్ అంటించి ఉండటం చూసి చాలా బాధపడ్డారు.
ఓ వ్యక్తి సాయంతో ఆయన స్వయంగా వాటిని తొలగించి శుభ్రం చేశారు. అప్పుడు కూడా దారిన పోయేవారు ఎవరూ ఆయనని పట్టించుకోలేదు. ఇదీ మన పద్మశ్రీ కళాకారుడికి ఇచ్చే గౌరవం!