త్వరలోనే 2025 సంవత్సరం ముగియబోతోంది. 2025 ఏం బాగాలేదు. 2026లో తప్పకుండా చాలా బాగుంటుంది... అని చాలా మంది అనుకుంటారు... కోరుకుంటారు. అది మనవ నైజం. కానీ 2025లో చేసిన తప్పులు 2026లో చేయకుండా జాగ్రత్తపడినప్పుడే ఎంతో కొంత మనం ఆశించిన మార్పు వస్తుంది.
2025లో మేమేమి తప్పులు చేయలేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఏడాదిలో మనం మొబైల్ ఫోన్, సోషల్ మీడియాలో ఎంత సేపు కాలక్షేపం చేశాము? దాని వలన మనం కొత్త విషయాలు ఏవైనా నేర్చుకున్నామా?
ముఖ్యమైన పనులు అంటే పరీక్షలు, ఉద్యోగాలు, ఉన్నత చదువులకు సిద్దమయ్యామా లేదా? ఈ ఏడాదిలో కొత్తగా ఏమైనా నేర్చుకున్నామా లేదా?
తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామికి తగినంత సమయం కేటాయించి వారితో కులాసాగా గడిపామా లేదా? అని ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవాలి.
ఇన్ని ముఖ్యమైన పనులు పక్కనపెట్టి సోషల్ మీడియాలో రీల్స్ చూడటం, లైక్స్ కోసం మన సమయాన్ని వృధా చేసుకున్నామా? అని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి.
అలాగే కోపం వచ్చినప్పుడు ఆలోచించకుండా మాట్లాడటం, అతిగా మాట్లాడటం, గొప్పలు చెప్పుకోవడం, ఎదురుగా లేని బంధుమిత్రుల గురించి ఇతరులతో తప్పుగా లేదా చులకనగా మాట్లాడటం, చేయాల్సిన పనులను వాయిదా వేయడం వంటి దురలవాట్లను ఈ ఏడాదితో పాటే తప్పక వదిలేయాలి.
ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే వాటితో మన జీవితంలో చాలా పెద్ద మార్పు తప్పక వస్తుంది. కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా కేవలం క్యాలండర్ మార్చితే మార్పు రాదు.