బుధవారం సాయంత్రం హైదరాబాద్, లులూ మాల్లో ప్రభాస్ నటించిన రాజాసాబ్ పాట రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ నిధి అగర్వాల్ తిరిగి వెళుతుండగా బయట ఉన్న జనాలు ఒక్కసారిగా ఆమెని చుట్టుముట్టారు. వారందరూ పురుషులే. ఆమెను అసభ్యంగా తాకుతూ చాలా ఇబ్బంది పెట్టారు.
ఆమె బాడీ గార్డులు అతికష్టం మీద ఆమెను వారి నుంచి కాపాడుతూ కారులోకి ఎక్కించారు. ఈ ఘటనపై పలువురు నటీనటులు తీవ్రంగా స్పందిస్తూ ఖండించారు.
ప్రముఖ నేపధ్య గాయని చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “వీళ్ళు హైనాల కంటే దారుణంగా ప్రవర్తించారు. నిజం చెప్పాలంటే ఇలాంటి మగాళ్ళని హైనాలతో పోల్చడం కూడా తప్పే. ఇలాంటి దుర్బుద్ధి ఉన్న మగాళ్ళందరూ ఒక్క చోట చేరి ఓ మహిళను ఈవిధంగా వేధించడం చాలా దారుణం. ఇలాంటి మానవ మృగాలను దేవుడు వేరే గ్రహంలో పడేస్తే బాగుంటుంది,” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ఘటనని పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని, ఆమెను చూసేందుకు బయట వందలాది మంది గుమిగూడారని తెలిసి ఉన్నప్పటికీ లులూ మాల్ యాజమాన్యం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆమెను బయటకు పంపించింది. కనుక లులూ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కానీ అటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతున్నప్పుడు, అంతమంది సినీ ప్రముఖులు, అంత మంది జనం అక్కడ ఉన్నప్పుడు పోలీసులు కూడా అందుకు తగ్గట్లుగా భారీగా బందోబస్తు చేయాలి కదా?
సినీ నటులపై అభిమానంతో ఇతర నటుల అభిమానులతో సోషల్ మీడియాలో యుద్ధాలు చేసేవారు, ఓ నటి పట్ల ఈవిధంగా వ్యవహరించడం సిగ్గుచేటు కాదా? ఇది తమ అభిమాన హీరోకి తల వొంపు కాదా? అని అలోచించి ఉంటే ఈవిధంగా వ్యవహరించేవారు కారు.