బీఆర్ఎస్‌ పార్టీకి షాక్ ఇచ్చిన స్పీకర్‌

December 18, 2025


img

పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పోరాడుతున్న బీఆర్ఎస్‌ పార్టీకి స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ షాక్ ఇచ్చారు. పది మందిలో అరెకెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, టి.ప్రకాష్ మహేష్ కుమార్ గౌడ్‌, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలపై బీఆర్ఎస్‌ పార్టీ వేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.

రాజ్యాంగంలో తనకిచ్చిన అధికారాలను వినియోగించుకుంటూ ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తూ ఈ తీర్పు చెప్పారు.

రాజ్యాంగంలోని ‘పార్టీ మార్పు నియమాలు-1986’ ప్రకారం ఇరువర్గాలకు తమతమ  వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించి, అన్ని సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ తీర్పు చెప్పినట్లు శాసనసభ కార్యదర్శి తెలిపారు. 

పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్‌, కాలె యాదయ్యలపై బీఆర్ఎస్‌ పార్టీ వేసిన పిటిషన్లపై కూడా ఈ వారంలోనే విచారణ జరిపి తీర్పు చెప్పబోతున్నారు. 

మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి స్పీకర్‌ నోటీసులకు లిఖిత పూర్వకంగా ఇటీవలే జవాబు ఇచ్చారు.

దానిలో నేటికీ తాను బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నానని ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాని చెప్పారు. అందుకు సాక్ష్యంగా ప్రతీ నెల తన జీతం నుంచి రూ.5,000 బీఆర్ఎస్‌ పార్టీ శాసనసభా పక్షం ఖర్చుల కోసం చెల్లిస్తున్నానని, దానిని ఆ పార్టీ స్వీకరిస్తోందని తెలియజేశారు. కనుక తాను బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నట్లు లెక్క. పార్టీ మారలేదని కడియం శ్రీహరి అ లేఖలో తెలిపారు.   

మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. కనుక వీరిరువురి కేసులు తర్వాత విచారణ చేపడతారు. 


Related Post