ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు సుప్రీంకోర్టు ఏం చెపుతుందో?

December 19, 2025


img

నేడు సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించి వివరణ తీసుకున్నారు. వారి వాదనలు, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతున్న బీఆర్ఎస్‌ పార్టీ వాదనలు విన్నారు. 

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత పది మందిలో అరెకెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, టి.ప్రకాష్ మహేష్ కుమార్ గౌడ్‌, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలపై బీఆర్ఎస్‌ పార్టీ వేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.

మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్‌, కాలె యాదయ్యలపై బీఆర్ఎస్‌ పార్టీ వేసిన పిటిషన్లపై కూడా ఈ వారంలోనే విచారణ జరిపి తీర్పు చెప్పబోతున్నారు. 

కడియం శ్రీహరి నేటికీ తాను బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నానని ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాని చెప్పారు. దానం నాగేందర్ ఇంకా వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఆయన కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి న్యాయపోరాటం చేస్తున్నారు. 

ఈ నేపధ్యంలో నేడు సుప్రీంకోర్టు ఏవిధంగా స్పందిస్తుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. తమ ఆదేశం మేరకు స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు కనుక దానిని గౌరవిస్తుందా? లేక స్పీకర్‌ నిర్ణయాన్ని తప్పు పట్టి అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగిస్తుందా?అనేది నేడు తెలియవచ్చు.


Related Post