భారతీయులకు సౌదీ షాక్

June 21, 2017
img

సౌదీ అరేబియాలో నివసిస్తున్న విదేశీయులందరికీ సౌదీ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. అక్కడ ఉద్యోగం చేస్తున్న వారందరూ జూలై 1 నుంచి ఒక్కో ఉద్యోగి నెలకు 100 రియాల్స్ ‘డిపెండెంట్ టాక్స్’ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మన కరెన్సీలో ఒక రియాల్ సుమారు 17 రూపాయలు విలువ కలిగి ఉంది. అంటే ఒక్కో ఉద్యోగి నెలకు రూ.1700 చొప్పున ఏడాదికి రూ.20,400 చెల్లించవలసి ఉంటుంది.

ఒకవేళ ఆ ఉద్యోగి తన భార్య పిల్లలను కూడా తెచ్చుకొని ఉంటే వారికి కూడా ఒక్కొక్కరికీ నెలకు రూ.1,700 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఆ లెక్కన ఒక ఉద్యోగికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే నలుగురికి కలిపి ఏడాదికి రూ. 81,600 చెల్లించవలసి ఉంటుందన్న మాట! అయితే సౌదీలో నెలకు కనీసం 4-5,000 రియాల్స్ జీతం అందుకొంటున్నవారే ఎక్కువగా కుటుంబంతో నివసిస్తుంటారు. సాధారణంగా కార్మికులు, ఇతర ఉద్యోగాలలో పనిచేసేవారు ఒంటరిగానే జీవిస్తుంటారు. వారిలో మంచి జీతం అందుకొంటున్నవారు ఈ అదనపు భారాన్ని భరించగలరేమో కానీ చాలా తక్కువ వేతనానికి పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు ఇది పెనుభారమే అవుతుంది. 

సౌదీ అరేబియాలో సుమారు 41 లక్షల మంది భారతీయులు పని చేస్తున్నారు. వారిలో ఎక్కువగా కేరళ ఆ తరువాత తెలంగాణా, ఆంధ్రా, తమిళనాడు,కర్నాటక, యూపి, బీహార్ రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. తెలంగాణాలో హైదరాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి వెళ్ళిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు. సౌదీలో భారతీయులు కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిపిన్స్ తదితరదేశాల నుంచి వచ్చినవారు ఎక్కువగా ఉన్నారు. యూరోపియన్ దేశస్తులు కూడా సౌదీలో పని చేస్తుంటారు. సాధారణంగా వారు పెద్ద ఉద్యోగాలలోనే ఉంటారు. 

దాదాపు 5 దశాబ్దాలుగా సౌదీ అరేబియా కోట్లాది మంది భారతీయులకు ఉద్యోగాలు కల్పిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపుతోంది. కానీ సౌదీలో కూడా క్రమంగా జనాభా..దానితో బాటే నిరుద్యోగం పెరగడంతో ఈవిధంగా ఆదాయమార్గాలను అన్వేషించవలసివస్తోంది. సౌదీ ప్రేరణతో మిగిలిన గల్ఫ్ దేశాలు కూడా ‘డిపెండెంట్ టాక్స్’ విధించే అవకాశాలున్నాయి. 

Related Post