కులభూషణ్ జాదవ్ ఉరిశిక్షపై స్టే

May 18, 2017
img

కులభూషణ్ జాదవ్ కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన ఉరి శిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విదించింది. ఈ కేసులో తాము తుది తీర్పు వెలువరిచేవరకు జాదవ్ కు ఉరిశిక్షను అమలుచేయరాదని పేర్కొంది. ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం కలుగజేసుకొనేందుకు హక్కు లేదన్న పాక్ న్యాయవాది చేసిన వాదనలను న్యాయస్థానం తిరస్కరించింది. భారత్-పాక్ మద్య ఏర్పడిన వియన్నా ఒప్పందం క్రింద ఈ కేసును విచారించి తీర్పు చెప్పే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. జాదవ్ ను కలిసి మాట్లాడేందుకు భారత్ 16 సార్లు పాకిస్తాన్ కు లేఖలు వ్రాసింది. కానీ పాక్ అందుకు అనుమతించలేదు. వియన్నా ఒప్పందం ప్రకారం భారత్ అధికారులకు పాక్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం కూడా తప్పేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుపై పాక్ లో మీడియా, ప్రతిపక్షాలు, న్యాయవాదులు అప్పుడే నిరసనలు తెలుపుతున్నారు. పాక్ తరపున వాదించిన న్యాయవాదులు ఈ కేసులో సరిగ్గా వాదించలేకపోవడం వలననే జావేద్ ఉరిశిక్షపై స్టే వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం స్టే ఆదేశాలకు పాక్ మిలటరీ కోర్టు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు కనుక జాదవ్ ను తక్షణమే ఉరి తీయవచ్చని కొంతమంది వాదిస్తున్నారు. ఒకవేళ జాదవ్ కు శిక్ష అమలుచేస్తే పాక్ తో సంబంధాలను పునః సమీక్షించుకోవలసి వస్తుందని భారత్ పాక్ ను గట్టిగా హెచ్చరించింది. ఇప్పుడు ఈ కేసు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్నప్పుడు దాని మాట కాదని జాదవ్ ను ఉరి తీస్తే అంతర్జాతీయ న్యాయస్థానం తప్పు పడుతుంది. పైగా జాదవ్ నిర్దోషి అనే భారత్ వాదనలకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తుంది. జాదవ్ ను దోషి అని నిరూపించకుండానే పాక్ ఉరి తీసిందనే చెడ్డపేరు కూడా మూటగట్టుకోవలసి వస్తుంది.       కనుక పాక్ ప్రభుత్వం అందుకు సాహసించకపోవచ్చు. 

Related Post