ట్రంప్ కు మళ్ళీ ఎదురుదెబ్బ?

March 16, 2017
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముస్లింల పట్ల తనకు గల ద్వేషభావాన్ని తన మాటలలో బయటపడకుండా  దాచుకోగలుగుతున్నప్పటికీ ఆయన చర్యలలో అవి విస్పష్టంగా ప్రకటితం అవుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలోనే ఆయన తన విద్వేషాన్ని బయటపెట్టుకొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత దానిని ఆచరణలో పెట్టి చూపుతున్నారు అంతే! ముస్లింలు అందరూ ఉగ్రవాదులే లేదా వారి సానుభూతిపరులేనన్నట్లుగా ఉంది ఆయన తీరు. అందుకే అధికారం చేతికి రాగానే ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. కానీ దానిని దిగువ కోర్టు నుంచి ఫెడరల్ కోర్టు వరకు అన్నీ వ్యతిరేకించడంతో ట్రంప్ ప్రభుత్వం మళ్ళీ దానికి సవరణలు చేసి కొత్త చట్టాన్ని సిద్దం చేసింది. 

ఈసారి ఆ ఏడు దేశాలలో నుంచి ఇరాక్ కు మినహాయింపు ఇచ్చింది. కానీ దానిపై కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆ కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ హవాయిలోని జిల్లా కోర్టులో దాఖలైన ఒక పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ డెర్రిక్ వాట్సన్ తన తీర్పును వెలువరిస్తూ “ఈ కొత్త చట్టం కూడా రాజ్యాంగంలోని మత సమానత్వం, మత స్వేచ్చకు భరోసా కల్పించే ఎస్టాబ్లిష్ మెంట్ క్లాజ్ కు ఈ చట్టం వ్యతిరేకంగా ఉంది. కనుక దీని అమలుపై స్టే విదిస్తున్నాను,” అని చెప్పారు. 

ట్రంప్ ప్రభుత్వానికి ఇది చెంపదెబ్బ వంటిదేనని చెప్పకతప్పదు. ఎందుకంటే అమెరికా అధ్యక్ష హోదాలో ఆయన జారీ చేసిన ఉత్తర్వులను వరుసగా రెండవసారి కూడా ఒక జిల్లా కోర్టు తిరస్కరించడం, దానిపై స్టే విదించడం చాలా అవమానకరమే. అది మొదటిసారి తిరస్కరణకు గురైనప్పుడే న్యాయస్థానాలు కూడా తన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయనే సంగతి గ్రహించకుండా దానిలో సాంకేతిక అంశాలను మాత్రమే అవి వ్యతిరేకిస్తున్నాయని భావించడమే పెద్ద తప్పు. కనుక ట్రంప్ ప్రభుత్వం ఆ లోపాలను సవరించి మళ్ళీ కొత్తగా చట్టం చేసినప్పటికీ కోర్టుల తిరస్కరణకు గురవుతోంది. ఇది ట్రంప్ ప్రభుత్వానికి, ఆయన హోదాకు కూడా ఏమాత్రం గౌరవం కాదు. 

Related Post