అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు, తమిళనాడుకి చెందిన ఒకరు కారు ప్రమాదంలో మరణించారు. మృతులలో ఓరంపాటి ఆర్యన్ రఘునాధ్, ఫారూక్ షేక్, పాలచర్ల లోకేష్ ముగ్గురూ హైదరాబాద్‌కి చెందినవారు కాగా దర్శిని వాసుదేవ్ అనే యువతి తమిళనాడుకు చెందినదిగా పోలీసులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు ఈ విషాద సమాచారం అందించారు.
వారు నలుగురు కార్ పూలింగ్ చేసుకొని శుక్రవారం బెన్‌టోన్‌విల్లేకు బయలుదేరారు. వారి కారు టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలోని రోడ్ నంబర్ 75లో ప్రయాణిస్తున్నప్పుడు అతివేగంగా దూసుకుపోతున్న 5 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. దాంతో వారి కారుకి మంటలు అంటుకున్నాయి. క్షణంలో మంటలు వ్యాపించడంతో కారులో నుంచి బయటకు రాలేక నలుగురూ దానిలోనే సజీవ దహనం అయిపోయారు.
వారిలో ఆర్యన్ డల్లాస్‌లో తమ బంధువులని కలిసేందుకు వెళుతుండగా, పాలచర్ల లోకేష్ తన భార్యని కలిసేందుకు బయలుదేరారు. ఫరూఖ్, దర్శిని వాసుదేవ్ యూనివర్సిటీకి వెళ్ళేందుకు అదే కారు ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్నారు.