లండన్‌లో హైదరాబాద్‌ యువతి మృతి

April 20, 2023
img

హైదరాబాద్‌కు చెందిన తేజస్వి కొమ్మారెడ్డి (24) అనే యువతి లండన్‌లో చనిపోయింది. ఆమె సైదాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో (సీఎస్ఈ) డిగ్రీ పూర్తిచేసిన తర్వాత  క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో లండన్‌ వెళ్లింది. ఈ నెల 11వ తేదీన స్నేహితులతో కలిసి విహారయాత్రకు బ్రైటన్ బీచ్‌కు వెళ్ళింది. అందరూ బీచ్‌లో దిగి ఆడుకొంటుండగా, కెరటాల తాకిడికి తేజస్విని సముద్రంలోకి కొట్టుకుపోయింది. సమీపంలోనే ఉన్న బీచ్‌ పెట్రోల్ సిబ్బంది వెంటనే సముద్రంలో గాలించి తేజస్విని ఒడ్డుకు చేర్చారు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది.      

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఒక్కగానొక్క బిడ్డ తేజస్వి. చిన్నప్పటి నుంచి ఆటపాటలు, చదువులలో తేజస్వి ఎంతో చురుకుగా ఉండేది. తమ కుమార్తె లండన్ వెళ్ళి ఉన్నతవిధ్యాలభ్యసిస్తోందని తేజస్వి తల్లితండ్రులు అందరికీ ఎంతో గర్వంగా చెప్పుకొనేవారు. తన ఫస్ట్ టర్మ్ పూర్తయిందని తేజస్వి చనిపోయే ముందురోజు తల్లితండ్రులకు వీడియో కాల్ చేసి చెప్పడంతో వారు చాలా సంతోషించారు. మరో ఆరేడు నెలల తర్వాత కూతురు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్‌కు వెళ్ళేందుకు తేజస్వి తల్లితండ్రులు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. కానీ ఇంతలోనే ఈ విషాదవార్త వినవలసి రావడంతో వారు తల్లడిల్లిపోతున్నారు. హైదరాబాద్‌లో ఐఎస్ సదన్ డివిజన్‌లోని లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న వారి ఇంటికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళి ఓదార్చి తేజస్వి మృతదేహాన్ని హైదరాబాద్‌ తరలించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.

Related Post