ఇటీవల చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో సాయిప్రభాత్ నగర్‌కు చెందిన హేమంత్ శివరామకృష్ణ (20) భారత కాలమాన ప్రకారం అమెరికాలో మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. అతను అమెరికాలో బార్బడోస్ యూనివర్సిటీలో మెడిసన్ రెండో సంవత్సర విద్యార్ధి.
మంగళవారం స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్ళి సరదాగా ఈతకొట్టాడు. కాసేపు తర్వాత బీచ్ ఒడ్డున స్నేహితులతో కబుర్లు చెప్పుకొంటుండగా హటాత్తుగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు కానీ అప్పటికే అతను గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు చెప్పడంతో వారు షాక్ అయ్యారు.
ఈ విషయం తెలుసుకొని ఖమ్మంలోని అతని తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతని తండ్రి టి.రవికుమార్ ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్నారు. కొడుకు అమెరికాలో వైద్యవిద్యా అభ్యసించి డాక్టరుగా తిరిగివస్తాడని తాము ఎదురుచూస్తుంటే, ప్రాణం కోల్పోయి శవపేటికలో వస్తుంటే చూడవలసివస్తోందని వారు విలపిస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు హేమంత్ మృతదేహాన్ని అమెరికా నుంచి హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.