డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్... వెంటనే విడుదల

April 05, 2023
img

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు న్యూయార్క్ నగరంలోని మన్‌హటన్‌ కోర్టులో విచారణకు హాజరయ్యారు.

ఆయన 2007లో అమెరికాలో ప్రసిద్ద శృంగార తార (పోర్న్ స్టార్) స్టార్మీ డేనియల్స్‌తో శృంగారం చేశారు. ఆమె ఆ విషయం 2011లో బయటపెట్టింది. 2016 అక్టోబరులో అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆమె నోరు తెరవకుండా ఉంచేందుకు డోనాల్డ్ ట్రంప్ తన లాయర్ మైఖేల్ కోహెన్ ద్వారా ఆమెకు 1,30,000 డాలర్లు చెల్లించారు. ఆమె మౌనంగా ఉండిపోవడంతో డోనాల్డ్ ట్రంప్ సునాయాసంగా ఎన్నికలలో గెలిచి అమెరికా అధ్యక్షుడయ్యారు. 

ఆమెకు తన సొంత డబ్బునే ఇచ్చానని, దీంతో డోనాల్డ్ ట్రంప్‌కు ఎటువంటి సంబందామూ లేదని మైఖేల్ కోహెన్ నేరం అంగీకరించడంతో మన్‌హటన్‌ కోర్టు ఆయనకు 2018 డిసెంబర్‌లో మూడేళ్ళు జైలు శిక్ష విధించింది. మన్‌హటన్‌ కోర్టు ఆదేశం మేరకు ఆదాయపన్ను శాఖ అధికారులు ట్రంప్ సంస్థల ఆర్ధిక లావాదేవీలను, పన్ను చెల్లింపులను పరిశీలించినప్పుడు స్టార్మీ డేనియల్స్‌కు చెల్లింపులు జరిపేందుకు చేసుకొన్న ఒప్పంద పత్రాలను గుర్తించి న్యాయస్థానానికి తెలియజేశారు. 

కనుక ఈ కేసు విచారణకు హాజరుకావాలని మన్‌హటన్‌ కోర్టు ఆదేశాలను జారీ చేయగా ట్రంప్ వాటిని పట్టించుకోలేదు. దీంతో ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. అప్పుడు గానీ ట్రంప్ దిగిరాలేదు. తన అనుచరులతో కలిసి వచ్చి పోలీసులకు లొంగిపోగా వారు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 

కోర్టుకు బయలుదేరే ముందు ట్రంప్ తన అనుచరులకు ఈ మెయిల్స్ పంపారు. “నా అరెస్టుకు ముందు పంపుతున్న చివరి ఈ మెయిల్ ఇది. ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో తృతీయ ప్రపంచదేశాలలో అనుసరించే మార్కిస్ట్ సిద్దాంతాలను అమలుచేయబోతున్నారు. ఎటువంటి నేరం చేయని నన్ను అరెస్ట్ చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. కనుక న్యాయస్థానం విశ్వసనీయతను సోషల్ మీడియాలో ప్రశ్నించాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. నా గొంతు వినిపించకుండా అణచివేసేందుకు ఈ ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా నేను భయపడేది లేదు. మళ్ళీ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి 2024లో వైట్ హౌసులో అడుగుపెడతాను. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను,” అంటూ మెయిల్స్ పంపారు.              

ఆయన పిలుపు మేరకు వేలాదిమంది రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు, ఆయన అనుచరులు అక్కడకు చేరుకొని విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉన్నందున సోమవారం నుంచే న్యూయార్క్ నగరం అంతటా ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు. 

న్యాయస్థానం ఆయనపై 34 నేరాభియోగాలు చదివి వినిపించింది. వాటన్నిటినీ ట్రంప్ తిరస్కరించారు. అనంతరం కోర్టు అనుమతితో తిరిగి వెళ్ళిపోయారు.

Related Post