అమెరికాలో ఎన్ఆర్ఐ దుర్మరణం

April 03, 2023
img

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలీదని చెప్పడానికి ఇదో తాజా ఉదాహరణ. అమెరికాలో బోస్టన్ నగరంలోని లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-బి బయట  స్నేహితుడు కోసం కారులో కూర్చొని ఎదురుచూస్తున్న విశ్వచంద్ కోళ్ళ (47)ని ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన ట్రక్ బలంగా ఢీకొట్టడంతో చనిపోయాడు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విశ్వచంద్ కోళ్ళ చాలా ఏళ్ళుగా తకెడ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో డేటా అనలిస్ట్‌గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు. మార్చి 28వ తేదీన భారత్‌ నుంచి తన స్నేహితుడు వస్తుండటంతో అతనిని పికప్ చేసుకొనేందుకు విమానాశ్రయానికి వెళ్ళి, ఇంకా సమయం ఉండటంతో తన కారులోనే బయట వేచి చూస్తున్నారు. అదే సమయంలో డార్ట్ మౌత్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీకి చెందిన ఓ ట్రక్ వేగంగా దూసుకువచ్చి బలంగా ఢీకొట్టడంతో విశ్వచంద్ ఘటనాస్థలంలోనే చనిపోయారు. ఆ ట్రక్కుని నడిపిస్తున్న మహిళా డ్రైవర్‌ను మసాచూసెట్స్  పోలీసులు అరెస్ట్ చేసారు. 

అమెరికాలోని విశ్వచంద్ బంధుమిత్రులు వెంటనే ‘గో ఫండ్ మీ’ అనే వెబ్‌సైట్‌ సృష్టించి దానిద్వారా ఇప్పటి వరకు 4,06,151 డాలర్లు విరాళాలు సేకరించారు. ఆ సొమ్మును ఆయన కుటుంబానికి అందజేయనున్నారు.   


Related Post