అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. అదీ... ఓ ఎలిమెంటరీ స్కూల్లో కావడంతో 9 ఏళ్ళలోపు ముగ్గురు విద్యార్థులు బలైపోయారు. స్థానిక కాలమాన ప్రకారం సోమవారం ఉదయం, ఓ మహిళ టేనస్సీ రాష్ట్ర రాజధాని నగరం నాష్ విల్లేలోని ఓ ప్రైవేట్ ఎలిమెంటరీ స్కూల్లో తుపాకీతో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరుపగా, ముగ్గురు విద్యార్థులు, స్కూల్ ఇన్‌ఛార్జ్‌తో సహా ముగ్గురు సిబ్బంది ఘటనాస్థలంలోనే చనిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కాల్చి చంపారు లేకుంటే మరెందరో ఆమె చేతిలో ప్రాణాలు పోగొట్టుకొని ఉండేవారు.
పోలీసులు ఆమెను అదే ప్రాంతానికి చెందిన ఆడ్రీ హేల్‌గా గుర్తించారు. నపుంసకురాలైన ఆమె గతంలో అదే స్కూలులో చదువుకొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఇంటిని సోదా చేయగా, వారికి చుట్టుపక్కల మరికొన్ని లక్ష్యాలకు సంబందించిన మ్యాప్స్ దొరికాయి. వాటిలో ఈ స్కూల్ కూడా ఒకటి. కనుక ఆమె ముందుగా ఈ స్కూల్‌ని ఎంచుకొని కాల్పులు జరిపిన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
అమెరికాలో తరచూ ఈవిదంగా పాఠశాలలు, షాపింగ్ మాల్స్, పబ్బులు, పార్కులు తదితర బహిరంగ ప్రదేశాలలో కాల్పులు జరగడం, ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేయడం పరిపాటిగా మారిపోయింది. తుపాకుల అమ్మకాలను నిషేదించడానికి జో బైడెన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అధికార, ప్రతిపక్షాల మద్దతు లభించడం లేదు. ఎందుకంటే అమెరికాలో ఈ ఆయుధాల వ్యాపారంలో వేలకోట్ల డాలర్ల టర్నోవర్ జరుగుతుంటుంది. కనుక ఆయుధాల తయారుచేసేవారు, వాటితో వ్యాపారాలు చేసేవారు చాలా బలమైన లాబీగా ఏర్పడి ప్రభుత్వాలని నిషేధం విదించకుండా అడ్డుకొంటుంటారు. వారి ధనకాంక్షకు ఈవిదంగా అభంశుభం తెలియని అనేకమంది చిన్నారులు బలైపోతుంటారు. 2012లో కనెక్టికట్ రాష్ట్రంలో జరిగిన కాల్పులలో 20 మంది చిన్నారులు చనిపోయారు.