రాజమౌళికి న్యూజెర్సీవాసులు వెరైటీ అభినందనలు

March 21, 2023
img

ఆర్ఆర్ఆర్‌ సినిమాలో నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డ్ రావడం ఓ గొప్ప విషయం అయితే, ఆ తర్వాత దేశవిదేశాలలో ప్రజలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్న తీరు ఆ సినిమా బృందానికి ఎప్పటికీ మరపురాని మధురానుభూతిగా నిలిచిపోతుంది. ఇటీవల ఢిల్లీలో దక్షిణ కొరియా, ఆ తర్వాత జర్మనీ రాయబార కార్యాలయ సిబ్బంది ఈ పాటకు ఢిల్లీ గల్లీలో ఫ్లాష్ డ్యాన్స్ చేసి తమ అభిమానం చాటుకోగా, తాజాగా అమెరికాలో న్యూజెర్సీ నగరంలో 150 టెస్లాకారు యజమానులు ఈ పాటకి ఎవరూ ఊహించలేని విదంగా తమ కార్ల లైట్లతో అద్భుతంగా డిజిటల్ డ్యాన్స్ ప్రదర్శించి అభిమానాన్ని చాటుకొన్నారు. 

ఈవిదంగా చేయవచ్చనే కలిగిన ఓ ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి నగర మేయర్ సామ్ జోషి, ది ఎడిసన్ టౌన్ షిప్ టీమ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నాసా, పెర్సిస్ బిర్యానీ (సౌత్ ప్లెయిన్ ఫీల్డ్), ప్రోస్పర్ రియాలిటీల భాగస్వామ్యంతో  అత్యద్భుత ప్రదర్శన చేయగలిగామని నిర్వాహకులు వంశీ కొప్పురవురి తెలిపారు. ఇంకా దిలీప్ ప్యాండ, ఉజ్వల్ కాస్తాల, అరుణ్ శ్రీరామినేని, కృష్ణ సిద్దాడ, సత్యా పెరుమాళ్ళ, సౌరీష్ పెరుమాళ్ళ, సాయి గుడివాడ, నరేన్ వేములపల్లి, శశి మైలు, అమర్ కంచెర్ల, వంశీ కొత్త, వేద కొప్పురవురి తదితరులు ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడం కోసం ఎంతగానో కృషి చేశారు. 

దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ, “నాటునాటు పాటతో ఇంత అద్భుతంగా అభినందనలు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ప్రదర్శించిన వంశీ కొప్పురవురితో ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని చంద్రబోస్, వంశీ కొప్పురవురి ఆస్కార్ అవార్డుతో ఉన్న ఫోటోను ట్యాగ్ చేశారు. 150 టెస్లా కార్లతో ప్రదర్శించిన ఈ నాటునాటు పాట ఎంత అద్భుతంగా ఉందో మీరూ చూసి ఆనందించండి.     


Related Post