భారత్ యువత గుండెలు అకస్మాత్తుగా ఎందుకు ఇంత బలహీనమవుతున్నాయో తెలియదు కానీ నిత్యం దేశంలో చాలా మంది యువత గుండెపోటుతో మరణిస్తున్నారు. మొన్న ఆదివారం ఖమ్మం జిల్లా మధిరకు చెందిన రాకేష్ అనే 18 ఏళ్ళ ఇంటర్ విద్యార్ధి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా నిజామాబాద్‌కు చెందిన పూజిత రెడ్డి (24) అనే బీడిఎస్ వైద్య విద్యార్ధిని కెనడాలో పీజీ చేసేందుకు వెళ్ళి పది రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయింది.
నిజామాబాద్‌లోని మల్కాపూర్ (ఏ) గ్రామ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి రెండో కుమార్తె పూజిత రెడ్డి. ఖమ్మంలో బీడిఎస్ పూర్తి చేసిన తర్వాత పీజీ చేసేందుకు జనవరి 26న కెనడా వెళ్ళింది. అక్కడ ఆమె సోదరుడు అరుణ్ రెడ్డి ఇంట్లో కొన్ని రోజులు హాయిగా గడిపిన తర్వాత యూనివర్సిటీలో చేరి తరగతులకు హాజరవుతోంది. పదిరోజుల క్రితం హాస్టల్ గదిలో కుప్పకూలిపోగా ఆమె రూమ్మేట్స్ వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ చికిత్స పొందుతూ పూజిత రెడ్డి చనిపోయింది.
మంచి డాక్టరుగా పేరు తెచ్చుకొంటానని చెప్పి కెనడా వెళ్ళిన కూతురు, నిర్జీవంగా తిరిగిరావడం చూసి ఆమె తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే వారిని చూసి గ్రామస్తులు కంట తడిపెట్టారు. సోమవారం ఉదయం పూజిత రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.