అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రభుత్వంలో పలువురు భారతీయ మూలాలున్నవారికి కీలక పదవులలో నియమించుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి అమెరికా తరపున అజయ్ బంగా (63) పేరుని నామినేట్ చేశారు. ప్రపంచ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మద్దతు ఇస్తే అత్యున్నతమైన ఆ పదవిలో ఆయన నియమితులవుతారు.
అజయ్ బంగాకి భారత్ ప్రభుత్వం 2016లో పద్మశ్రీ అవార్డుతో సన్మానించింది. ఆయన మొదట మాస్టర్ కార్డ్ ఛైర్మన్ అండ్ సీఈవోగా చేశారు. ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ కంపెనీ వైస్- ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇదివరకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో కలిసి పనిచేశారు. సుమారు 30 ఏళ్ళకి పైగా పలు అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలని విజయవంతంగా నడిపించిన అజయ్ బంగా, యావత్ ప్రపంచాన్ని ఆర్ధిక మాంద్యం కమ్ముకొంటున్నవేళ ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి చేపట్టడానికి తగినవారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
ప్రపంచ బ్యాంకుకి అత్యధికంగా నిధులు సమకూరుస్తున్న దేశం అమెరికా. కనుక ఆ దేశాధ్యక్షుడు నామినేట్ చేసిన వ్యక్తిని ప్రపంచ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సాధారణంగా తిరస్కరించరు. కనుక ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడుగా అజయ్ బంగా నియామకం జరిగే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి ఇండో-అమెరికన్, తొలి సిక్కుగా అజయ్ బంగా చరిత్ర సృష్టిస్తారు.