కెనడాలో ఉద్యోగం... రెండు రోజులకే అవుట్

November 10, 2022
img

ఇటీవల ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత సుమారు 3,500 మందిని ఉద్యోగాలలో నుంచి పీకేయడమే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే, మరో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సంస్థ ఏకంగా 11,000 మందిని ఉద్యోగాలలో నుంచి తొలగించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో కేవలం రెండు రోజుల క్రితమే చేరిన భారత్‌కు చెందిన వి. హిమాన్షు కూడా ఉన్నాడు. అతను 2022 అక్టోబర్ వరకు హైదరాబాద్‌లోని గిట్ హబ్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేసేవాడు. అంతకు ముందు ఫ్లిప్ కార్ట్, అడోబ్ సంస్థలలో పనిచేసేడు. 

ఇటీవల ఫేస్‌బుక్‌, కెనడాలో ఉద్యోగం రావడంతో ప్రస్తుత ఉద్యోగానికి రిజైన్ చేసి చాలా సంతోషంగా కెనడా వెళ్ళి ఉద్యోగంలో చేరాడు. కానీ చేరిన రెండు రోజులకే 11,000 మంది ఉద్యోగులతో పాటు హిమాన్షు ఉద్యోగం కూడా ఊడిపోయింది. దీంతో అతను షాక్ అయ్యాడు. ప్రస్తుతం తనలాగే ఫేస్‌బుక్‌లో అనేకమంది రోడ్డున పడ్డారని, ఊహించని ఈ పరిణామంతో అందరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు. తర్వాత ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కనుక భారత్‌ లేదా కెనడాలో ఎక్కడైనా ఉద్యోగం పొందేందుకు ఎవరైనా సాయం చేయాల్సిందిగా అభ్యర్ధిస్తున్నాడు హిమాన్షు. ఫేస్‌బుక్‌లో ఉద్యోగాలు పోగొట్టుకొన్న 11,000 మంది పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుందనుకోవచ్చు. 


Related Post