ఇది సికింద్రాబాద్, ప్యారడైజ్ హోటల్లో నోరూరించే బిర్యాని గురించి కాదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో సంపూర్ణేష్ బాబు గురించి. ఈ సినిమాలో అయన పాత్ర పేరు బిర్యాని... అంటే ఎప్పటిలాగే కమ్మగా ఉంటాడని కాదు.
తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే ఇతను నిజంగానే కామెడీ యాక్టర్ సంపూర్ణేష్ బాబేనా కాదా? అని సందేహం కలుగుతుంది. అంత భయంకరంగా ఉన్నాడు. వర్ణించడం కంటే ఆ పోస్టర్ చూస్తే సరిపోతుంది.
ఈ సినిమాలో నాని పాత్ర పేరు ‘జడల్’, నాని లుక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఓ విలన్ ‘శికంజ మాలిక్’గా చేస్తున్న మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అద్భుతంగా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ‘ప్యారడైజ్’ ఏదో ఉందని అర్ధమవుతుంది.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: సాయి, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల చేస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కాబోతోంది.