నా గుండెల్లో కేసీఆర్‌... నా దోస్త్ కేటీఆర్‌!

December 19, 2025


img

బీఆర్ఎస్‌ పార్టీలో సంక్షోభం ఏర్పడిన ప్రతీసారి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు చొరవ తీసుకొని పరిష్కరిస్తుంటారు. కానీ కల్వకుంట్ల కవిత ఆయనే పార్టీలో ‘కట్టప్ప’ అని ఏదో రోజు కేటీఆర్‌ని కూడా తనలాగే బయటకు పంపించేస్తారని పదేపదే ఆరోపిస్తున్నారు. 

ఆమె ఆరోపణలపై హరీష్ రావు స్పందించలేదు కానీ సిఎం రేవంత్ రెడ్డి విమర్శలకు జవాబు చెప్పే క్రమంలో ఆమెకూ సమాధానం చెప్పేశారు. “పంచాయితీ ఎన్నికల ఫలితాలు చూసి రేవంత్ రెడ్డికి భయం మొదలైంది. త్వరలోనే కాంగ్రెస్‌ పతనం తప్పదని గ్రహించారు. ఆ ఆందోళనతోనే అసహనంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నాకు కేటీఆర్‌కి మద్య ఎటువంటి విభేదాలు లేవు. కానీ విభేదాలు సృష్టించి మమ్మల్ని విడదీయాలని కుట్రలు చేశారు. తద్వారా బీఆర్ఎస్‌ పార్టీని బలహీనపరిచి దెబ్బ తీయాలనుకుంటున్నారు. కానీ మళ్ళీ మరోసారి చెపుతున్నా. కావాలంటే రాసి పెట్టుకోండి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉంటాను. నా గుండెల్లో కేసీఆర్‌ ఉన్నారు. నా పక్కన కేటీఆర్‌ ఉన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో మేమిద్దరం కలిసి పనిచేస్తాము. మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్‌ పార్టీని అధికారంలోకి తెస్తాము,” అని అన్నారు. 

కనుక కల్వకుంట్ల కవిత ఆరోపణలన్నిటికీ హరీష్ రావు ఈవిధంగా సమాధానం చెప్పినట్లే భావించవచ్చు. అంతే కాదు.. ఆమెని సిఎం రేవంత్ రెడ్డే తమకు వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నారని చెప్పకనే చెప్పారనుకోవచ్చు. ఆమె వెనుక సిఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నట్లు హరీష్ రావు ఆరోపిస్తుంటే, ఆయన సిఎం రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నారని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పార్టీలో లేరు కనుక ఎవరితో చేతులు కలిపినా తప్పు కాదు. కానీ ఆమె వెనుక సిఎం రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్‌ మంత్రులు ఎవరైనా ఉన్నారా లేరా? అనేది తెలియాల్సి ఉంది. 



Related Post