మేడారంలో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు

December 20, 2025
img

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర జనవరి 28 నుంచి ప్రారంభం కాబోతోంది. ఏటా ఈ మహాజాతరకు దాదాపు కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు. తెలంగాణ ఏర్పడి 11 ఏళ్ళు అవుతున్నా మేడారం పరిస్థితి అలాగే ఉంది. కనుక సిఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధి పనులకు రూ.251 కోట్లు కేటాయించారు. 

గత ఏడాది సెప్టెంబర్‌లో మేడారం అభివృద్ధి  పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి శరవేగం పనులు సాగుతున్నాయి. గిరిజనులు, ఆదివాసీల సంప్రదాయాలు ప్రతిభింబించే విధంగా శిల్పాలు చెక్కిన గ్రానైట్ రాతి స్థంభాలు, పలకలతో నిర్మాణాలు చేపట్టారు. 

ముఖ్యంగా వనదేవతల గద్దెలను విస్తరించి గ్రానైట్ రాతితో పునర్నిస్తున్నారు. ఎత్తైన రాతి స్తంభాలతో స్వాగత ద్వారాలు, సువిశాలమైన ప్రధాన గద్దెలు, వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఎక్కడికక్కడ అవసరమైన వసతులు, సౌకర్యాలు, చక్కటి క్యూలైన్లు నిర్మిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచే వచ్చే భక్తుల కోసం తిరుమల, శ్రీశైలం, యాదగిరిగుట్ట తరహాలో కాటేజీలు కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. 

మహాజాతర మొదలైతే భక్తులతో మేడారం కిటకిటలాడుతుంది. కనుక ఇప్పటి నుంచే రోజూ వందలాదిమంది భక్తులు వచ్చి గద్దెలను దర్శించుకుంటున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం ఈ స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతుందని అనుకోలేదని, కానీ జరుగుతున్న పనులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెపుతున్నారు. ఓ పక్క ఇన్ని పనులు జరుగుతున్నా గద్దెల దర్శనానికి ఎటువంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంతున్నందుకు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరచూ మేడారంలో పర్యటిస్తూ సమీక్షిస్తుండటంతో అభివృద్ధి పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. 

(Video Courtesy: News 18 Telugu)

Related Post