అందుకే ఇమ్రాన్ ఖాన్‌ను చంపాలని ప్రయత్నించా!

November 04, 2022
img

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై గురువారం వజీరాబాద్‌లో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా తృటిలో తప్పించుకొన్నారు. ఈ ప్రయత్నంలో ఆయన కుడికాలికి గాయం అయ్యింది. ఆయనతో సహా పిటిఐ పార్టీకి చెందిన మరికొందరు నేతలు కూడా గాయపడ్డారు. వారందరూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. 

ఇమ్రాన్ ఖాన్‌ తన పిటిఐ పార్టీ నేతలతో కలిసి లాంగ్ మార్చ్ పేరిట పాకిస్తాన్‌లో పర్యటిస్తూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన వజీరాబాద్‌లో ఓ కంటెయినర్‌పై నిలబడి ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తుండగా హటాత్తుగ్గ ఓ వ్యక్తి ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అక్కడున్నవారు వెంటనే అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

వారు తెలిపిన సమాచారం ప్రకారం, ఇమ్రాన్ ఖాన్‌ లాంగ్ మార్చ్ పేరుతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గట్టిగా నమ్ముతున్న నిందితుడు ఆయనను లాహోర్ నుంచి వెంబడిస్తున్నాడని తెలిపారు. చివరికి వజీరాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడని తెలిపారు. తనకి మరెవరితో సంబందంలేదని తాను ఒక్కడినే ఇమ్రాన్ ఖాన్‌ని మాత్రమే కాల్చి చంపాలని వచ్చానని, వేరెవరిని టార్గెట్ చేసుకోలేదని నిందితుడు చెప్పినట్లు పోలీసులు చెప్పారు. అతనిపై కేసు నమోదు చేసి, అన్ని కోణాలలో నుంచి దర్యాప్తు జరుపుతున్నామని పాకిస్తాన్ పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పాకిస్తాన్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలతో సహా వివిద దేశాల నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేసి, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నామని సోషల్ మీడియాలో సందేశాలు పెట్టారు.


Related Post