బ్రిటన్ ప్రధానిగా భారత్‌కు చెందిన రుషి సునాక్

October 25, 2022
img

ఒకప్పుడు భారతదేశాన్ని పాలించిన బ్రిటన్ దేశానికి ఇప్పుడు భారత్ మూలాలు కలిగిన రుషి సునాక్ ప్రధానమంత్రి అయ్యారు. ఆ దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడంతో బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఇటీవల రాజీనామా చేయడంతో రిషి సునక్ ఆ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ పార్లమెంటులో 193 మంది ఎంపీలు రుషి సునాక్‌కు మద్దతు తెలుపగా, ఈ పదవి కోసం ఆయనతో పోటీ పడిన మోర్డన్‌కు కేవలం 27 మంది ఎంపీ మాత్రమే మద్దతు తెలిపారు. 

మరో విశేషమేమిటంటే సరిగ్గా నెల్లన్నర క్రితం ఇటీవల రాజీనామా చేసిన లిజ్ ట్రస్‌ చేతిలో రుషి సునాక్‌ ఓడిపోయారు. ఇప్పుడు ఆమె స్వయంగా రాజీనామా చేసి తప్పుకోవడంతో ఈసారి ఎంపీలు రుషి సునాక్‌ను ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన ఈనెల 28న బ్రిటన్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

రుషి సునాక్‌ భారత్‌ మూలాలు... రుషి సునాక్‌ పూర్వీకులు భారత్‌లో పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారు. ఆయన తల్లితండ్రులు ఇంగ్లాండ్‌లో స్థిరపడటంతో రుషి సునాక్‌ 1980, మే 12వ తేదీన సౌతాంప్టాన్ నగరంలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకానమీలో డిగ్రీ చేసిన తర్వాత స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. ఆ తర్వాత 2001-04 మధ్య ప్రముఖ సంస్థ గోల్డ్‌మాన్‌ సాక్‌లో ఆర్ధిక నిపుణుడిగా పనిచేశారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకొన్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు.

రుషి సునాక్‌ రాజకీయ ప్రవేశం: తొలిసారిగా 2014లో రిచ్‌మండ్‌ నుంచి పార్లమెంటుకి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017,2019లో ఎన్నికలలో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. తర్వాత సహాయ మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా, ఛాన్సలర్‌గా పనిచేశారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లో ఆర్ధికమంత్రిగా చేశారు. బోరిస్ జాన్సన్‌పై ఆరోపణలు రావడంతో రుషి సునాక్‌ తన పదవికి రాజీనామా చేసి ఆయన ఆర్ధిక విధానాలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. రుషి సునాక్‌తో పాటు పలువురు ఎంపీలు రాజీనామా చేయడంతో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దాంతో ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే.

Related Post