అమెరికాలో భారతీయ కుటుంబం దారుణ హత్య

October 06, 2022
img

అమెరికాలో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబాన్ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతులలో జస్దీప్ సింగ్ (36), ఆయన భార్య జస్లీన్ కౌర్ (27), వారి ఎనిమిది నెలల పాప ఆరోహి, ఆ పాప మేనమామ అమన్ సింగ్ (39)గా కాలిఫోర్నియా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో బెదిరించి వారి కారులోనే కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు. వారు కిడ్నాప్ అయినట్లు సమాచారం అందగానే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన మెర్సిడ్ పోలీసులకు, మంటలలో తగులబడిన కారు కనిపించింది. దాని రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా అది వారి కారే అని గుర్తించారు. 

బుదవారం సాయంత్రం కాలిఫోర్నియాలో ఇండియానా రోడ్- హచిన్సన్ రోడ్ మద్య ఓ తోటలో నలుగురి మృతదేహాలను చూసిన ఓ వ్యవసాయకార్మికుడు మెర్సిడ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీసీ కెమెరా రికార్డింగ్ ఆధారంగా పోలీసులు జీసస్ మాన్యువల్ సల్గోడా అనే ఓ కరడు గట్టిన నేరస్థుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

జస్దీప్ సింగ్ స్థానికంగా వ్యాపారం చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకొంటున్నాడు. వారి కుటుంబానికి ఎవరితో ఎటువంటి విభేధాలు లేవని వారు అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని ఇరుగుపొరుగులో నివాసం ఉంటున్న అమెరికన్స్ తెలిపారు. జస్దీప్ సింగ్ తల్లితండ్రులు డాక్టర్ రణధీర్ సింగ్, కిర్పాల్ కౌర్  పంజాబ్‌లో హోషియార్ పూర్ తాండా బ్లాక్‌లోని హార్సిపిండ్ గ్రామానికి చెందినవారు. కొడుకు, కోడలు, మనుమరాలు అమెరికాలో హత్యకు గురయ్యారని తెలిసి ఆ వృద్ధదంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 


Related Post