ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలో దారుణం జరిగింది. పశ్చిమ కాబూల్లో దస్తే-ఏ- బార్చి అనే ప్రాంతంలో కాజ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే స్టడీ సెంటరులో విద్యార్థులు ఓ యూనివర్సిటీ ఎంట్రన్స్ మాక్ టెస్ట్ (పరీక్ష) వ్రాస్తుండగా ఆత్మహుతి దాడి జరిగింది. ప్రేలుడు జరిగిన సమయంలో ఆ భవనంలో సుమారు 600 మంది విద్యార్థులున్నట్లు గాయపడిన ఓ విద్యార్ధిని తెలిపింది. పరీక్ష వ్రాస్తున్నవారిలో ఆడపిల్లలే ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం.
వారు పరీక్ష వ్రాస్తుండగా ఇద్దరు వ్యక్తులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, ఓ వ్యక్తి విద్యార్థులున్న గదిలోకి జొరపడి ఆత్మహుతి దాడి చేశాడని, ఆ విద్యాసంస్థ అధినేత ముక్తార్ ముదాబీర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ దాడిలో తన సోదరి కూడా చనిపోయిందని తెలిపాడు.
తుపాకుల కాల్పుల శబ్ధాలతో తరగతి గదిలో భయంతో గజగజవణికిపోతున్న విద్యార్థులు బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోవాలనుకొన్నారు. కానీ అంతలోనే ఓ వ్యక్తి లోపలకి ప్రవేశించి తనను తాను బాంబులతో పేల్చేసుకొన్నాడు. ఈ దాడిలో సుమారు 28 మంది విద్యార్థులు మరణించగా మరో 32 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ప్రేలుడు ధాటికి విద్యార్థులు శరీరభాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఒక్క క్షణంలో వారందరూ ఎవరూ గుర్తుపట్టలేని మాంసం ముద్దలుగా మారిపోయారు. క్లాసు రూమ్ అంతటా తెగిన శరీర భాగాలు చెల్లాచెరుగా పడ్డాయి. క్లాస్ రూమ్ అంతా రక్తంతో తడిసిపోయింది.
పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులలో చాలా మంది హాజరా అనే ఓ మైనార్టీ వర్గానికి చెందిన విద్యార్థులే ఉన్నారు. గతంలో కూడా ఆ వర్గం ప్రజలపై వేరే వర్గంవారు దాడులు చేశారు. కనుక ఈ దాడి వారిపనే అయ్యుంటుందని భావిస్తున్నారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కనుక మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఉగ్రవాదుల నుంచి, ఇటువంటి ఉగ్రదాడుల నుంచి ప్రజలను కాపాడవలసిన ప్రభుత్వం తాలిబాన్ ఉగ్రవాదుల చేతిలో ఉంది.