బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతి

September 09, 2022
img

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (96) స్కాట్‌లాండ్‌లోని బల్మోరలో గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆమె బ్రిటన్ దేశాన్ని 70 ఏళ్ళ సుదీర్గకాలం పరిపాలించారు. గత కొన్నేళ్ళుగా ఆమె వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో బల్మోర రాజభవనంలోనే ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం ఆమె పరిస్థితి విషమించడంతో కన్ను మూశారు. 

ఆమె మరణించడంతో ఆమె పెద్ద కుమారుడు వేల్స్ మాజీ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపడతారు. ఆయన తన భార్య కెమిల్లాతో కలిసి శుక్రవారం లండన్ చేరుకొని ఆమె అంత్యక్రియలలో పాల్గొంటారు. బ్రిటన్ ఆనవాయితీ ప్రకారం 24 గంటలలో వారసుడిని ప్రకటించాల్సి ఉంటుంది కనుక నేడు మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశమై ప్రిన్స్ ఛార్లెస్‌ను బ్రిటన్ రాజుగా ప్రకటిస్తారు. 

ఆ తర్వాత బ్రిటన్ పార్లమెంట్ సమావేశమై రాణి ఎలిజబెత్-2కి నివాళులు అర్పించి, బ్రిటన్ రాజు ఛార్లెస్ పట్ల విదేయత ప్రకటిస్తారు. ఆ తర్వాత బ్రిటన్ రాజుగా ఆయన పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. అప్పుడు ఆయన బ్రిటన్ రాజుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి సుమారు ఆరు నెలల సమయం పడుతుంది.      

సుదీర్గకాలం పాటు బ్రిటన్ రాణిగా ఉన్న ఆమె భారత్‌తో సహా 100కి పైగా దేశాలలో పర్యటించారు. కనుక దేశాధినేతలందరితో నేరుగా ఆమెకు పరిచయాలున్నాయి. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీతో దేశాధినేతలందరూ సంతాపం తెలియజేస్తున్నారు.

Related Post