తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఎప్పుడైనా విదేశీ యాత్రలకు బయలుదేరారంటే తప్పకుండా కనీసం రెండు మూడు అంతర్జాతీయ సంస్థలు లేదా పరిశ్రమలైనైనా రాష్ట్రానికి రప్పిస్తుంటారు. ఈసారి కూడా దావోస్ పర్యటనకు ముందు లండన్‌లో దిగి అక్కడి సంస్థలతో చర్చలు జరపగా మూడు సంస్థలు సానుకూలంగా స్పందించాయి.
వాటిలో సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్ ఒకటి. ఆ సంస్థ హైదరాబాద్‌లో అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబోరేటరీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. రెండోది లండన్‌లో ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజీ. హైదరాబాద్ నగరంలో ఫార్మా సిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీలో పరిశోధన, విద్యా వ్యవహారాలలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు అంగీకరించింది. మూడవది పియర్సన్. ఈ సంస్థ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్)తో కలిసి పనిచేసేందుకు అంగీకరించింది.
మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనలో ప్రవాస తెలంగాణవాసులతో కూడా సమావేశమయ్యారు. వారిని కూడా రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఏర్పాటు చేసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేయగా వారిలో చాలామంది సానుకూలంగా స్పందించారు. తన లండన్ పర్యటన ఫలితాలు త్వరలో కనబడతాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
మంత్రి కేటీఆర్ దావోస్ సదస్సులో అడుగుపెట్టక మునుపే లండన్‌లోనే మూడు సంస్థలను ఒప్పించి రాష్ట్రానికి రప్పిస్తున్నారు. నిన్నటి నుంచి ఈ నెల 26వరకు జరిగే దావోస్ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి ఇంకెన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలను ఆకర్షిస్తారో ఈ నాలుగు రోజులలోనే తెలుస్తుంది.