రష్యా-ఉక్రెయిన్‌ చర్చలు విఫలం

February 28, 2022
img

రష్యా ఉక్రెయిన్ దేశాల ప్రతినిధుల మద్య ఈరోజు మధ్యాహ్నం బెలారస్‌లో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. రష్యా నుంచి ఐదుగురు, ఉక్రెయిన్‌ నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ కీలక సమావేశానికి హాజరయ్యి సుమారు 4 గంటల పాటు చర్చించారు. అయితే ఇరుపక్షాలు పట్టు విడుపులు ప్రదర్శించకపోవడంతో చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా దళాలు మళ్ళీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాయి. 

నాటో కూటమిలో చేరబోనని ఉక్రెయిన్‌ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా పట్టుబట్టింది. దానికి ఉక్రెయిన్‌ అంగీకరించలేదు. ముందు రష్యా తక్షణం యుద్ధం నిలిపివేసి తన సేనలను క్రిమియా నుంచి పూర్తిగా వెనక్కు తీసుకోవాలని పట్టుబట్టింది. అందుకు రష్యా అంగీకరించలేదు. దీంతో చర్చలు విఫలం అయ్యాయి. 

నాటో దేశాలను నమ్ముకొని ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ ఒంటరిగా మిగిలిపోయిందని, కనీసం ఇప్పుడైనా తమకు మద్దతు ఇవ్వాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ రెండు రోజుల్ క్రితం చేసిన విజ్ఞప్తిపై నాటో దేశాలు సానుకూలంగా స్పందిస్తూ ఆయుధాలు పంపిస్తున్నాయి. కనుక ఇరుదేశాల మద్య ఊహించిన దానికంటే ఎక్కువ రోజులు, ఎక్కువ తీవ్రతతో యుద్ధం కొనసాగచ్చు. 

ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో దేశాలు ముందుకు వస్తుండటంతో రష్యా అధ్యక్షుడు పుతీన్ అణుబాంబులను ప్రయోగించడానికి సిద్దంగా ఉంచమని తమ రక్షణశాఖకు నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు చర్చలు విఫలం అవడం, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సాయపడుతుండటంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. 

మరోపక్క ఉక్రెయిన్‌ నుంచి ఇప్పటివరకు 6 విమానాలలో మొత్తం 1400 మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి చేరుకొన్నారు. మరో 4,000-6,000 మంది ఉక్రెయిన్‌ విడిచి పొరుగు దేశాలకు చేరుకొన్నారు. వారిని భారత్‌కు తరలించేందుకు కేంద్రప్రభుత్వం నిరంతరంగా ప్రత్యేక విమానాలు నడుపుతోంది.

Related Post