అన్ని దేశాలు హ్యాండ్ ఇచ్చాయి: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు

February 25, 2022
img

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు ఉక్రెయిన్‌పై మహాశక్తివంతమైన రష్యా బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తూ విరుచుకుపడుతోంది. తమకు అండగా నిలబడాలని, తమ ప్రజలను కాపాడాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా, నాటో సభ్యదేశాలకు వేడుకొన్నా ఏ ఒక్క దేశమూ ముందుకు రాలేదు. దీంతో రష్యా మరింత రెచ్చిపోయి ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తోంది. రష్యా దాడులలో అనేకమంది ఉక్రెయిన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు...కొందరు లొంగిపోతున్నారు కొందరు పారిపోతున్నారు. 

ఒకే ఒక్క రోజులోనే ఉక్రెయిన్‌ పరిస్థితులు అత్యంత దయనీయంగా మారిపోవడంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర ఆవేదనతో, “రష్యా మాపై దాడులు చేస్తుంటే ఏ ఒక్క దేశమూ మాకు సాయపడేందుకు రాలేదు. ఇంతకాలం మాకు మిత్రదేశాలని చెప్పుకొనేవి కూడా ముందుకు రాలేదు. అవి మాతో ఉన్నాయో లేవో చెప్పాలని కోరుతున్నాను. అన్ని దేశాలు రష్యాను చూసి భయపడుతున్నాయి. రష్యా మొదలుపెట్టిన ఈ పోరాటంలో మేము ఒంటరిగా, నిస్సహాయంగా మిగిలిపోయాము. మా దేశాన్ని కాపాడుకొనేందుకు మా సైనికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. మిత్రదేశాలు ఏవీ మన దేశాన్ని కాపాడేందుకు రావని స్పష్టం అయ్యింది కనుక మన దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు ముందుకు వచ్చినా వారికి ప్రభుత్వం ఆయుధాలు అందించడానికి సిద్దంగా ఉంది. నేను దేశం విడిచిపారిపోయానని వస్తున్న వార్తలు నిజం కాదు. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు నేను నా ప్రజలతోనే ఉంటాను,” అని అన్నారు. 

అధ్యక్షుడు జెలెన్ స్కీ పిలుపు మేరకు ఉక్రెయిన్‌లో వేలాదిమంది పురుషులు తమ భార్యాపిల్లలను కడసారిగా చూసుకొని కన్నీటితో వీడ్కోలు చెప్పి ప్రభుత్వం అందిస్తున్న ఆయుధాలు చేతపట్టి రష్యా సేనలతో యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ పక్క రష్యా ఉక్రెయిన్‌పై భీకర దాడులు కొనసాగిస్తుంటే, రష్యాలో పలు ప్రాంతాలలో ప్రజలు  రోడ్లపైకి వచ్చి ఉక్రెయిన్‌పై దాడులకు నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు రష్యా పోలీసులు 1700 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. అయినప్పటికీ తమ అధ్యక్షుడు పుతీన్ తీరుని ఖండిస్తూ రష్యా ప్రజలు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఇంటా, బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నా రష్యా అధ్యక్షుడు పుతీన్ మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు.

Related Post